దేశ రాజధాని ఢిల్లీ మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేవలం ఒక్క నిరసన కార్యక్రమం కోసం ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలు, ఉక్కుపాదం మోపిన తీరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను లక్ష్యంగా చేసుకుని జంతర్ మంతర్ వేదికగా ఆందోళనకు పిలుపునిచ్చిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఉదంతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన అభిజీత్ దీప్కే(Abhijeet Dipke) తన ప్రయాణాన్ని ఎంతో ఉత్సాహంగా ప్రారంభించారు. అయితే, ఆయన ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ గడ్డపై చక్రాలు ఆన్చిన క్షణాల వ్యవధిలోనే ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నారు. సాధారణంగా ప్రయాణికులు విమానం దిగి ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోకి వచ్చాక అరెస్టులు లేదా అదుపులోకి తీసుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. విమాన ప్రయాణం ముగిసి, తలుపులు తెరుచుకునే లోపే పదుల సంఖ్యలో ఎంటరైన ఢిల్లీ పోలీసుల బృందం నేరుగా ఫ్లైట్‌లోకి దూసుకెళ్లింది.
తన సహచరులు సౌరవ్ దాస్(Saurav Das), అశుతోశ్ రాంకాలతో కలిసి సీటులో ఉన్న అభిజీత్ దీప్కేను పోలీసులు చుట్టుముట్టడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. "మేం కిందకు దిగే వరకు ఆగలేరా? బయటకు వచ్చాక అరెస్ట్ చేసుకోండి, మేం ఎవరికీ భయపడం" అంటూ దీప్కే పోలీసులతో వాగ్వాదానికి దిగినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గలేదు. క్షణాల్లోనే ఆయన్ను, మిగతా నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకుని విమానాశ్రయం నుంచి ఏ క్షణంలో ఎక్కడికి తరలించారో కూడా అంతుచిక్కని రహస్యంగా మార్చేశారు.
మరోవైపు ఈ నిరసన సెగను ఎక్కడికక్కడ అణచివేయాలని భావించిన పోలీసులు రాజధానిలో అసాధారణ ఆంక్షలను అమలు చేశారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు సీజేపీ లీగల్ వింగ్ హెడ్ రత్నా సింగ్‌లను ఎవరి ఇళ్ల నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. అర్ధరాత్రి వేళ ఆపరేషన్ చేపట్టి సుమారు 400 మందికి పైగా అనుమానిత నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌ను అతలాకుతలం చేస్తూ ఏకంగా 45 మెట్రో స్టేషన్లను మూసివేయగా, పలు రైళ్లను నిలిపివేశారు. శాంతిభద్రతల పేరుతో కేంద్ర బలగాలు, ఢిల్లీ(Delhi) పోలీసులను కలుపుకుని ఏకంగా 35 వేల మందికి పైగా సిబ్బందిని రోడ్లపై మోహరించారు. నిరసనకు ముందస్తు అనుమతి నిరాకరించినప్పటికీ, ఇంతటి భారీ స్థాయిలో వ్యవస్థను అప్రమత్తం చేయడం, విమానంలోనే లీడర్లను లాక్కకెళ్లడం చూస్తుంటే ఢిల్లీలో ప్రజాస్వామ్య గొంతుకలను నొక్కేస్తున్నారంటూ సీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.