బాలయ్యకు లుక్ సమస్య!

admin
Published by Admin — September 30, 2026 in Telangana
News Image

‘వీరసింహారెడ్డి’ తర్వాత నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న చిత్రం.. దాదా. కొన్ని నెలల కిందటే మొదలైన ఈ చిత్రాన్ని చకచకా పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని టీం నిర్ణయించుకుంది. డిసెంబరు 24న రిలీజ్ అంటూ టీజర్లో డేట్ కూడా వేశారు. కానీ ఈ సినిమా ఆ డేటుకి రాదేమో అన్న సందేహాలు కొంచెం గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ చిత్రం సంక్రాంతి రేసులోకి వెళ్లొచ్చనే ప్రచారం జరుగుతోంది. 

బాలయ్యకు గాయం అయి రెస్ట్ మోడ్‌లోకి వెళ్లాకే చిత్ర బృందం టీజర్ రిలీజ్ చేసి, క్రిస్మస్ విడుదల అని చెప్పింది. మరి బాలయ్య కోలుకుని ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో, ఎప్పటికి షూటింగ్ పూర్తవుతుందో అన్నీ అంచనా వేసుకునే కదా డేట్ ఇచ్చారు.. మళ్లీ వాయిదా వార్తలేంటి అనే సందేహం నందమూరి అభిమానుల్లో ఉంది. ఐతే బాలయ్య కోలుకుని షూటింగ్‌కు వచ్చినా.. సినిమాకు అవసరమైన లుక్‌లో కనిపిస్తారా అనే అనుమానంతోనే సినిమాను వాయిదా వేయాలని చూస్తున్నట్లు సమాచారం.

గాయం కారణంగా బాలయ్య రెండు నెలలుగా ఇంటిపట్టునే ఉంటున్నారు. గాయమైంది చేతికి కావడం, పైగా సర్జరీ జరగడంతో ఎక్సర్‌సైజులు పూర్తిగా ఆపేశారు. దీని వల్ల ఆయన షేప్ అవుట్ అయ్యారు. ఇటీవల బాలయ్యను కొంతమంది కలిసిన సందర్భంగా ఫొటోలు బయటికి వచ్చాయి. అందులో బాలయ్య లుక్ అంత బాగా లేదు. ఈ లుక్‌తో షూట్‌కు వెళ్తే కష్టం. రేప్పొద్దున సినిమా రిలీజైనపుడు ట్రోల్స్ తప్పవు. 

బాలయ్యకు ఇప్పుడు 66 ఏళ్లు. అయినా సరే.. తెర మీద ఆయన చాలా హుషారుగా కనిపిస్తుంటారు. వీలైనంత ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ పాత్రలకు తగ్గట్లు కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు బాలయ్య లుక్ బాగా లేదని అభిమానులు కూడా అంగీకరిస్తున్నారు. శస్త్ర చికిత్స నుంచి కోలుకున్నాక కొన్ని వారాల పాటు కసరత్తులు చేసి బెటర్ లుక్‌లోకి మారారే షూటింగ్‌కు వెళ్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను క్రిస్మస్ నుంచి సంక్రాంతికి వేయాలనుకోవడానికి ఇది ఒక ముఖ్య కారణమని తెలుస్తోంది.

Tags
Balakrishna look issue Gopichand malineni movie
Recent Comments
Leave a Comment

Related News