తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS) మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ నేతలు లక్ష కోట్లు దోచుకున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డికి ఇచ్చిన సంచలన ఆఫర్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
"మీరు చెబుతున్న ఆ లక్ష కోట్లలో మాకు కేవలం వెయ్యి కోట్లు ఇస్తే చాలు.. మా కుటుంబ ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికే రాసిచ్చేస్తాం" అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మిగిలిన 99 వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల అమలు కోసం ఖర్చు చేసుకోవచ్చంటూ సెటైర్లు వేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్(Congress) పార్టీ నిత్యం మైండ్ గేమ్‌లు ఆడుతోందని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రోజూ ఒక కొత్త విచారణ డ్రామాను తెరపైకి తెస్తున్నారని కేటీఆర్(KTR) ఆరోపించారు. తాము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని, చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంతమంది అధికారులతో విచారణ జరిపించినా వాస్తవాలు మారబోవని తేల్చిచెప్పారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కేవలం ప్రతిపక్షాలపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే త్వరలో తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.