ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన విజయవాడ(Vijayawada) నగర పాలక సంస్థ మేయర్ పీఠం ఇప్పుడు ఆసక్తికరమైన రాజకీయ సమరానికి వేదికగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెజవాడ పీఠాన్ని దక్కించుకునేందుకు రేసు తీవ్రమైంది. ఒక్క స్థానం కోసం భారీగా ఆశావహులు పోటీ పడుతుండటంతో.. అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిని ఎంపిక చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకి పెద్ద సవాలుగా మారింది.
టీడీపీలో భారీ పోటీ.. ఉత్కంఠ రేపుతున్న పేర్లు
తెలుగుదేశం పార్టీ నుంచి మేయర్ పదవిని ఆశిస్తున్న వారి జాబితా పెద్దదే ఉంది. సీనియర్లు, యువ నేతలు, పార్టీ కోసం కష్టపడిన ప్రముఖుల వారసులు ఈ రేసులో గట్టిగా నిలబడ్డారు. ప్రధానంగా బొండా ఉమా కుమారుడు బొండా సిద్ధార్థ్, కొమ్మారెడ్డి పట్టాభి, దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, గద్దె అనురాధ, గన్నె వెంకటనారాయణ ప్రసాద్, ముమ్మనేని ప్రసాద్, కోనేరు శ్రీధర్, ఎర్రబోతు రమణారావు, కాకు మల్లికార్జున యాదవ్ వంటి నాయకులు ఈ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చందు దేవేనేని మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలవడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరంతా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రి లోకేష్‌లను కలుస్తూ తమ సీనియారిటీని, పార్టీకి చేసిన సేవలను బేరీజు వేసి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
కేవలం టీడీపీలోనే కాకుండా, కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన(Janasena), బీజేపీ నుంచి కూడా మేయర్ పదవిపై ఆశలు గట్టిగానే ఉన్నాయి. జనసేన తరఫున అమ్మిశెట్టి వాసు, పి. సుబ్బారాయుడుతో పాటు మరికొందరు నేతలు ఈ పీఠాన్ని ఆశిస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి కూడా ఒకరిద్దరు నాయకులు ఈ రేసులో రేసుగుర్లా మారుతున్నట్లు తెలుస్తోంది. కూటమి ధర్మాన్ని పాటించాల్సి ఉండటంతో, మిత్రపక్షాల ఆకాంక్షలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ స్థానిక నాయకత్వాన్ని సంతృప్తి పరచడం అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది.
కాగా, కులాలు, ప్రాంతీయ సమీకరణాలు, సీనియారిటీ, ప్రజల్లో ఉన్న ఆదరణ.. ఇలా ప్రతీ అంశాన్ని బేరీజు వేసుకుంటూ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ఏ ఒక్క వర్గానికి అవకాశమిచ్చినా మిగిలిన వారి నుంచి అసంతృప్తి రాకుండా చూడటం ముఖ్యం. నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, అపారమైన వ్యూహాత్మక చతురత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి(CM Chandrababu Naidu)కి ఇలాంటి సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం కొబ్బరి కాయ కొట్టినంత పనే. మరి ఈసారి బెజవాడ మేయర్ గిరిని దక్కించుకుని, అందరినీ సమన్వయం చేసే ఆ అదృష్టశాలి ఎవరో తేలాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.