2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్త్రీ శక్తి పథకం కింద నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు. ఆ పథకానికి మహిళల నుంచి విశేష ఆదరణ వచ్చింది. ఈ క్రమంలోనే అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు మరో తీపి కబురు చెప్పారు. త్వరలో భారీ సంఖ్యలో రాబోతున్న ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామని ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి సొంతూరు మొగల్తూరులో నిర్వహించిన 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు ఈ ప్రకటన చేయడం విశేషం. పింఛన్ల రూపంలోనే ప్రజలకు రూ. 73,000 కోట్లు అందించామని ఆయన అన్నారు. మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 'దీపం' పథకం తెచ్చామని చెప్పారు. గత పాలకులు బటన్ నొక్కి చేతులు దులుపుకున్నారని, రోడ్ల నిండా గుంతలు పెట్టారని విమర్శించారు. ప్రతి అవ్వా తాత ఇంటికి వచ్చి వారికి గౌరవంగా పెన్షన్ అందిస్తున్నామని అన్నారు.