జగన్ అక్రమాస్తుల కేసులో ఆయనతోపాటు వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయ సాయిరెడ్డి కూడా 15 నెలలపాటు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వైఎస్ కుటుంబం కోసం, ప్రత్యేకించి జగన్ కోసం ఇంత చేసిన తనపై సజ్జల కోటరీతో మీడియాలో, సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించిన వైనం సాయిరెడ్డికి మింగుడుపడడం లేదు. అందుకే, బహిరంగంగా తొలిసారి జగన్ పై ఆయన విమర్శలు చేశారు. జగన్ సమక్షంలోనే తనను సజ్జల కొట్టారని, అయినా జగన్ సైలెంట్ గా ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇక, ఇదే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ధృవీకరించారు.
విజయసాయిరెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టిన మాట వాస్తవమేనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లీనరీ వేదికపై ఎవరు మాట్లాడాలి అనే విషయంపై సాయిరెడ్డి, సజ్జలల మధ్య గొడవ జరిగిందని, మాటా మాటా పెరిగడంతో సాయిరెడ్డిపై సజ్జల దాడి చేశారని కోటంరెడ్డి నిర్ధారించారు. విజయసాయికి జరిగిన అవమానాలు 74 కాదని, 75 అయ్యి ఉండవచ్చని తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా 100 వాహనాలతో స్వాగతం పలికారన్న కారణంతో విజయసాయిరెడ్డిని సజ్జల దుర్భాషలాడారని కోటంరెడ్డి చెప్పారు.
వైసీపీ మాజీ మంత్రి కోడలు చేస్తున్న ఆరోపణలపై జగన్, వైసీపీ నేతలు, సాక్షి మీడియా ఎందుకు స్పందించడం లేదని కోటంరెడ్డి నిలదీశారు. ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా ఫేక్ వీడియోలతో దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. వెలిగొండతోపాటు నాగార్జునసాగర్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టులు కట్టింది జగన్ అని వైసీపీ నేతలు క్రెడిట్ చోరీ చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు, భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది జగన్ అని కూడా చెప్పేట్లున్నారని సెటైర్లు వేశారు.