వైసీపీలో ఒకానొక సమయంలో ఆ పార్టీ అధినేత జగన్ తర్వాత నంబర్ టు గా విజయ్ సాయి రెడ్డి కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఎంట్రీతో విజయసాయిరెడ్డి ఆధిపత్యానికి చెక్ పడిందని టాక్ వచ్చింది. ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని, ఆ క్రమంలోనే సాయి రెడ్డి రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా సజ్జల మీద విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే సజ్జలను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖను రాశారు.
తనను నమ్మకద్రోహి అంటూ వైసీపీలో ఓ వర్గం విష ప్రచారం చేస్తున్నందుకే ఈ లేఖ రాయవలసి వచ్చిందని ఆయన చెప్పారు. 2022లో వైసీపీ ప్లీనరీ సందర్భంగా తనపై సజ్జల భౌతికంగా దాడి చేశారని, ఈ విషయం తెలిసినా జగన్ సైలెంట్ గా ఉండిపోయారని సాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికే సజ్జల చేతిలో జగన్ బందీ అయిపోయారని, అందుకే తనను పూర్తిగా పక్కన పెట్టేందుకు జగన్ రెడీ అయ్యారని అన్నారు. సాయన్నకు వయసైపోయింది, ముసలోడు అయిపోయాడు అంటూ తనను అనేక పదవుల నుంచి జగన్ తప్పించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మొత్తం 74 అవమానాలు జరిగాయని, ఎన్నో విషయాలు కడుపులో దాచుకున్నాను అని సాయి రెడ్డి బాధ పడ్డారు.
ఇప్పుడు వైసీపీలో నంబర్ టు జగన్ అని, నంబర్ వన్ సకల శాఖల మంత్రి సజ్జల అని సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీని కబ్జా చేసి జగన్ ను మోసం చేసే కోటరీ రాజకీయాలు నడపడం తనకు చేతకాదని, పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నానని అన్నారు.