రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేయడంలో జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) మార్కెట్ వేరు. ప్రతీ అడుగును వ్యూహాత్మకంగా వేసే ఆయన, ఇప్పుడు మరోసారి ప్రత్యర్థులకు సప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అధినేత పుట్టినరోజును కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రత్యర్థులను కట్టడి చేసేలా ఒక పదునైన రాజకీయ అస్త్రాన్ని ప్రయోగించేందుకు జనసేన పెద్దలు రంగం సిద్ధం చేశారు.
సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా జనసేన(Janasena) యువజన విభాగాన్ని అత్యంత శక్తివంతంగా పునఃప్రారంభించనున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో, మరీ ముఖ్యంగా గల్లీ స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త విభాగానికి రూపకల్పన చేశారు. యువత, మహిళల సాధికారతే ప్రధాన అజెండాగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలోనూ యువతను కలుపుకుంటూ దూసుకెళ్లేలా ఈ సరికొత్త కార్యాచరణ ఉండబోతోంది.
గత స్థానిక ఎన్నికల్లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ, జనసేన క్యాడర్ చూపించిన పోరాట పటిమను పార్టీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలను అనుకూలంగా మలచుకుంటూ, ఈసారి లోకల్ పోరులో తమ సత్తా నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే మంగళగిరి(Mangalagiri) కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో రాబోయే 30 రోజుల పాటు అనుసరించాల్సిన ప్రణాళికలపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారు. పవన్ బర్త్‌డే కానుకగా రానున్న ఈ యువజన అస్త్రం స్థానిక రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.