``మీరు ఒక మతానికి చెందిన వారే అయినప్పటికీ.. ఆ మత సంప్రదాయాలను పాటిస్తున్న వారే అయినా.. హిజాబ్‌ను పాఠశాలలో ధరించేందుకు అనుమతించనప్పుడు.. మీరు ఆ పాఠశాల నిబంధనలనే అనుస రించాలి. దానికి విరుద్ధంగా అనుసరించాలని మేం చెప్పలేం.`` అని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వాస్తవానికి `హిజాబ్` వ్యవహారంపై దేశవ్యాప్తంగా గత నాలుగేళ్లుగా వివాదం కొనసాగుతూ నే ఉంది. కర్ణాటకలో మొదలైన ఈ వివాదం అప్పట్లో సంచలనంగా మారింది.
అప్పట్లో కర్ణాటక హైకోర్టు హిజాబ్ ధారణ వ్యక్తిగత మని.. దీనిని నిరోధించేందుకు, వద్దని చెప్పేందుకు ఎవరికీ హక్కులేదని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛను కాపాడా ల్సిన బాధ్యత విద్యాసంస్థలపైనా ఉందని స్పష్టం చేసింది. కాగా.. తాజాగా ఇలాంటి వివాదమే ఉత్తర ప్రదేశ్ లో తలెత్తింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ బాలిక.. 11వ తరగతిలో చేరింది. ఈ పాఠశాలలో హిజాబ్ ధరిం చేందుకు యాజమాన్యం అంగీకరించలేదు.
దీంతో.. సదరు బాలిక హైకోర్టులో పిటిషన్ వేసింది. తన మత సంప్రదాయాల ప్రకారం.. హిజాబ్(హెడ్ స్కార్ఫ్) ధరిస్తానని.. దీనిని పాఠశాల యాజమాన్యం నిబంధనల పేరుతో అడ్డుకుంటోందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న, అదే మతానికి చెందిన విద్యార్థుల ఫొటోలను తెప్పించుకుని పరిశీలించింది. అయితే.. వారిలో ఏ ఒక్కరూ హిజాబ్ ధరించి లేరు. ఈ విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది.
పాఠశాల నిబంధనల మేరకు ఒకే మతానికి చెందిన విద్యార్థులు సైతం నడుచుకుంటున్నారని.. అలానే మీరు(పిటిషనర్ విద్యార్థిని) నడుచుకోవాలని సూచించింది. ఈ సమయంలో కర్ణాటక హైకోర్టు తీర్పును పిటిషనర్ ప్రస్తావించగా.. ఎవరైనా ఆర్టికల్ 25 ప్రకారం నడుచుకోవాల్సిందేనని..అ లాగని ఒక్కరికి మాత్రమే ప్రత్యేకతను ఆపాదించలేమని కోర్టు పేర్కొంది. మీరు ఓ మతానికి చెందిన విద్యార్థిని అయినప్పటికీ.. పాఠశాల నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందేనని, హిజాబ్ అవసరం లేదని స్పష్టం చేసింది.