ఏపీ(AP) రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే రకమైన సీన్ రిపీట్ అవుతుంటుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక లైన్ వస్తుంది... ఇంకేముంది, వైసీపీ నేతలందరూ దాన్ని యథావిధిగా మీడియా ముందుకు తెచ్చి అప్పజెప్పేస్తుంటారు. ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికల వేడి మొదలుకాగానే అదే తంతు మళ్లీ తెరపైకి వచ్చింది.
కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని, పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలతో ఎన్నికలు గెలవాలని చూస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) మరోసారి పాత పాట అందుకున్నారు. ఇక చాలాకాలంగా మీడియా కంట పడకుండా అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి రోజా కూడా నేడు సడన్‌గా బయటకు వచ్చి సరిగ్గా అదే డైలాగ్‌లను రిపీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలు గడిచిన ఐదేళ్లలో వైసీపీ(YCP) పాలన ఎలా సాగిందో ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రానికి ఏ ఒక్క కొత్త పరిశ్రమను తెచ్చారో, ఎన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పమంటే ఎవరి దగ్గరా సమాధానం ఉండదు. చివరకు తాము గొప్పగా చెప్పుకున్న మూడు రాజధానుల ఊసే ఎత్తలేకపోయారు. పోలవరాన్ని రివర్స్ టెండర్లతో పాతాళానికి తొక్కేసి, అమరావతిని అస్తవ్యస్తం చేశారు. ఉన్న అన్నా క్యాంటీన్లను మూసేసి, చివరికి రెండు లక్షల మంది వాలంటీర్లను రోడ్డున పడేసి మరీ దిగిపోయారు.
కానీ, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆగిన ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తూ, మెగా డీఎస్సీ(Mega DSC) ద్వారా ఒకేసారి 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ దూసుకుపోతోంది. ఇలా అడుగుపెట్టిన ప్రతిచోటా అభివృద్ధి కనిపిస్తుంటే చూసి ఓర్వలేక, "కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు" అంటూ చులకనగా మాట్లాడటం విచిత్రంగా ఉంది.
నిజానికి మున్సిపల్ ఎన్నికలలో మేయర్, చైర్‌పర్సన్ పదవులను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుండటంతో వైసీపీ శిబిరంలో గుబులు మొదలైంది. అందుకే, ఓటమి భారాన్ని ముందే తప్పించుకునేందుకు "బాబు దౌర్జన్యాలు చేస్తారంటూ" ఇప్పటి నుంచే సాకులు సిద్ధం చేస్తున్నారు. తాడేపల్లి నుంచి అందిన ఆ స్క్రిప్ట్‌ను పట్టుకొచ్చి రోజా(Roja)తో సహా అందరూ ఒకే గొంతుతో రికార్డు మోగిస్తున్నారు. మరి ఈ ఎన్నికల రణరంగంలో ఈ పాత పల్లవులు ఎంతకాలం నిలబడతాయో వేచి చూడాలి.