కాంగ్రెస్ సీనియర్ నేత, మాటలతో రాజకీయాలను వేడెక్కించే జగ్గారెడ్డికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నుంచి ప్రశంసలు లభించాయి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చినా.. సంగారెడ్డి నియోజకవర్గంలో మాత్రం జగ్గారెడ్డి ఓటమి పాలయ్యారు. అయినా.. ఆయన యాక్టివ్‌గానే వ్యవహరిస్తున్నారు. తనకు ఎలాంటి పదవీ ఇవ్వలేదని, గుర్తింపునకు కూడా నోచుకోలేదని మనసులో కొంత బాధ ఉన్నా.. జగ్గారెడ్డి మాత్రం ప్రజల్లోనే ఉంటున్నారు. తరచుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తనదైన ప్రశంసలు కూడా గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఎప్పటి నుంచో ఆయన ఎదురు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా ప్రశంసలు లభించాయి. తాజా గా సంగారెడ్డి నియోజకవర్గంలో పర్యటించిన సీఎం..లబ్ధి దారులకు `స్మార్ట్రే` రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం.. నిర్వ హించిన సభలో మాట్లాడుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన సతీమణితో కలిసి వేదిక ఎక్కారు. ఈ సమయంలో సీఎం రేవంత్.. ఆయనను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఆయన అత్యంత విధేయత, వినయం పార్టీకి ఎంతో దోహదపడుతున్నాయన్నారు.
అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాముడని.. జగ్గారెడ్డి హనుమంతుడని సీఎం రేవంత్ ప్రశంసించారు. పార్టీ విషయంలో ఆయన చూపే ఆదరం అంతా ఇంతా కాదన్నారు. అధిష్టానం గీసిన గీత దాటని వారిలో జగ్గారెడ్డి ముందు వరుసలో ఉన్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా జగ్గారెడ్డి మాత్రం ప్రజల మధ్యే ఉంటున్నారని.. సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇక్కడి సమస్యలను తరచుగా తన దృష్టికి కూడా తీసుకువస్తున్నారని అన్నారు. ప్రజలను ఇంతగా ఆదరించే నాయకుడిని సంగారెడ్డి ప్రజలు గెలిపించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కొందరు జగ్గారెడ్డిని కొనేందుకు ప్రయత్నించారని రేవంత్ వ్యాఖ్యానించారు. అయితే.. వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చినా.. ఇలాంటి నాయకుడు ఏ పార్టీకి దొరకరని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని కూడా వదిలేసి ప్రజల కోసం జగ్గారెడ్డి తిరుగుతున్నారని అన్నారు. ప్రజలు మార్కులు వేస్తే.. సీఎంగా తనకన్నా కూడా.. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికే ఎక్కువ మార్కులు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో ఏం జరిగినా.. జగ్గారెడ్డి మాత్రం ప్రజల మధ్యే ఉండాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. తన బదులు తన సతీమణిని నిలబెడతానని జగ్గారెడ్డి గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.