భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ స్థాయిలో ప్రకటించిన కొత్త కార్యవర్గం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. పార్టీ హైకమాండ్ తీసుకున్న తాజా నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోష్ నింపుతుంటే, తెలంగాణ కమలనాథుల్లో మాత్రం అసంతృప్తి, నిరాశను మిగులుస్తున్నాయి. ఒకే పార్టీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల పట్ల అధిష్టానం అవలంబించిన ఈ భిన్న వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి జాతీయ స్థాయిలో ఊహించని రీతిలో ప్రాధాన్యం దక్కింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా తెలుగు రాష్ట్రాల నుంచి సీనియర్ నేతలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari), రామ్ మాధవ్‌లకు అగ్రపీఠం దక్కడం ఏపీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. కేవలం ఉపాధ్యక్ష పదవులే కాకుండా, విష్ణువర్ధన్ రెడ్డికి జాయింట్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో ఏపీ నాయకత్వానికి హైకమాండ్ పెద్దపీట వేసిందని స్పష్టమవుతోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు శ్రమిస్తున్న నేతలకు ఈ పదవులు మరింత బలాన్ని చేకూరుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, తెలంగాణ(Telangana) బీజేపీ శ్రేణులను తాజా జాబితా తీవ్రంగా నిరాశపరిచింది. గతంలో జాతీయ స్థాయిలో కీలక పదవులు అనుభవించిన డీకే అరుణ, ఈటల రాజేందర్ వంటి ప్రముఖ నేతలకు లేదా మరెవరికీ ఈసారి జాతీయ కార్యవర్గంలో కనీసం ఒక్క చోటు కూడా దక్కలేదు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నామని చెబుతున్న తరుణంలో, జాతీయ టీమ్‌లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం శూన్యం కావడం గమనార్హం. ఇది రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ ఇస్తున్న పరోక్ష సంకేతమా లేక వ్యూహాత్మక మార్పా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మొత్తానికి, బీజేపీ జాతీయ కమిటీ కూర్పు తెలుగు రాష్ట్రాల రాజకీయ సమీకరణాలపై సరికొత్త ప్రభావం చూపుతోంది. ఏపీ నేతలు పండగ చేసుకుంటున్న వేళ, తెలంగాణ బీజేపీలో మాత్రం ఈ తాజా పరిణామం ఎలాంటి అలజడులకు దారితీస్తుందో వేచి చూడాలి.