దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్న వేళ, ఏపీ రాజకీయాల్లో మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఒకవైపు సీఎం చంద్రబాబు(CM Chandrababu) అమరావతిలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో అధికారిక వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కానీ, ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఈ వేడుకలకు పూర్తిగా దూరంగా ఉండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
అధికారిక వేడుకల్లో ఆయన కనిపించకపోవడమే కాకుండా, తాడేపల్లిలోని వైసీపీ(YCP) కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలకు కూడా జగన్ హాజరుకాకపోవడం గమనార్హం. ఆయన గైర్హాజరీలో సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం మినహా, జగన్ స్వయంగా ఎక్కడా జెండా పండగలో పాల్గొన్నట్లు ఎలాంటి ఫొటోలు గానీ, వీడియోలు గానీ అధికారికంగా విడుదల కాలేదు.
దీంతో "అసలు జగన్(Jagan) ఎక్కడ ఉన్నారు? జెండా పండగ రోజు ఎక్కడికి వెళ్లి ఉంటారు?" అంటూ వైసీపీ శ్రేణుల్లోనే గుసగుసలు మొదలయ్యాయి. వీకెండ్ కావడంతో ఆయన యథావిధిగా బెంగళూరులోని తన నివాసానికి చెక్కేశారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా జరుగుతోంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన జాతీయ పండుగ రోజున పార్టీ అధినేత పత్తా లేకపోవడం, కనీసం సొంత పార్టీ కార్యాలయంలో జరిగే వేడుకలకూ దూరంగా ఉండటం వెనుక అసలు రీజన్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.