``రాష్ట్ర విభజన తర్వాత.. జరిగిన పరిస్థితులు, పరిణామాలను గుర్తు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. రాజధా నిలేని రాష్ట్రంలో ప్రజలు ఎంతో ఆశ పెట్టుకుని 2014లో టీడీపీ కూటమిని గెలిపించారు. కానీ, రాజధాని లేదు. డబ్బు లేదు. బస్సులోనే పాలన ప్రారంభించాం. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఇబ్బందిగా ఉంది. బస్సులోనే నిద్రిస్తూ.. బస్సులేనే సమీక్షలు చేస్తూ.. పాలన చేసిన రోజులు మరిచిపోలేదు. ఓ రోజు రాత్రి అస్సలు నిద్రపట్టలేదు. ఏం చేయాలి? రాజధానికి భూములు ఎవరు ఇస్తారు? ఎక్కడ నుంచి తీసుకురావాలి? అని అంతర్మథనం చెందా. ఆ సమయంలో మేమున్నామంటూ.. రైతులు ఆదుకున్నారు. వారు ముందుకు వచ్చారు. వారు రాజధాని దాతలు.. కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు. వారి జీవితాలను రాష్ట్ర రాజధానికోసం ధార పోశారు.`` - అని సీఎం చంద్రబాబు తెలిపారు.
తాజాగా అమరావతిలోని కీలకమైన సీడ్ యాక్సెస్ రహదారిని, దీనిని కొండవీటివాగుతో అనుసంధానిస్తూ.. నిర్మించి న స్టీల్ బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం.. రైతులను ఉద్దేశించి.. సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాజధాని నిర్మాణం అనేది రాష్ట్రానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. విభజన కష్టాలను దాటుకుని ముందుకు వచ్చామన్న ఆయన.. ఇప్పుడు రాజధాని కష్టాలు కూడా దాటాయన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు.. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్టు తెలిపారు. ``ఇది ఏ ఒక్కరి కోసమో అనుకుంటున్నారు. కానీ, ఇది రాష్ట్ర ప్రజల కోసం చేసిన ఎంపిక.`` అని రాజధానిపై పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆ ఆలోచన అలా మొదలైంది..
రాజధాని నిర్మాణానికి ముందు.. భూముల సమీకరణ(పూలింగ్) ప్రక్రియపై చంద్రబాబు ఆస్తికర విషయాన్ని వివరిం చారు. ``ఓ రోజు సమీక్షలో రాజధాని అంశం ప్రస్తావనకు వచ్చింది. భూములు ఇవ్వాలంటే.. రైతులు ముందుకు వచ్చారు. కానీ, సమీకరించేందుకు అంత సొమ్ములేదు. ఈ క్రమంలో ఏం చేయాలన్నది తోచలేదు. సరిగ్గా ఆరోజే.. ఒకచోట ల్యాండ్ పూలింగ్ గురించి తెలుసుకున్నారు. దానిని ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించాను., కానీ.. రైతులు ఒప్పుకొంటారా? అని అనిపించింది. వారికి ఈ మాట చెప్పగానే.. ఎంతో ఉదారంగా ముందుకు వచ్చారు.`` అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
58 రోజుల్లోనే..
రాజధాని భూముల సమీకరణకు 2014-15 మధ్య ప్రకటన చేయగానే.. రైతుల నుంచి విశేష స్పందన లభించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. కేవలం 58 రోజుల్లోనే రైతులు ముందుకు వచ్చారని అన్నారు. ఏకంగా 29 వేల మంది రైతులు ముందు తమ భూములను రాజధానికి ఇచ్చారని చెప్పారు. వారికి ``శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా`` అని చంద్రబాబు పేర్కొన్నారు. రైతులకు ఈ రాష్ట్రం ఎప్పటికీ రుణ పడి ఉంటుందన్నారు. రాజధాని శరవేగంగా ముందుకు సాగుతుందని.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పారు.