గుంటూరులో ఓ మహిళపై టీడీపీ నేత ఒకరు చేసిన దాష్టీకం తాలూకు ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి ఆ అమానుష దాడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ దారుణ ఉదంతం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా, ఏ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. సమాజంలో ఏ మహిళను అవమానించినా, వారిపై దాడులకు తెగబడినా అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
అటువంటి అనాగరిక చర్యలకు మన సమాజంలో చోటు లేదని చెప్పారు. నిందితులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశానని అన్నారు. నిందితుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు మూర్తిని అరెస్టు చేశారు. మూర్తిని టీడీపీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీలతో అనుబంధం ఉందనే నెపంతో తప్పు చేసి తప్పించుకోలేరని అన్నారు. ఏ ఒక్కరికీ ప్రభుత్వం తరఫున ఎలాంటి రక్షణ లభించదని తేల్చి చెప్పారు. ఎటువంటి భయం, పక్షపాతం లేకుండా చట్టాన్ని నిష్పక్షపాతంగా, పకడ్బందీగా అమలు చేయడమే తమ ప్రభుత్వ ఏకైక విధానమని అన్నారు.
ఏపీలోని ప్రతి మహిళ గౌరవానికి, భద్రతకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. నూతన సమాజంలో మహిళలు పూర్తి ధీమాతో, రక్షణతో బతకాలన్నదే తమ ఆశయమని తెలిపారు. కాగా, గుంటూరులో నీటి కుళాయి దగ్గర గొడవ నేపథ్యంలో నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేసి, పిడిగుద్దులతో టీడీపీ నేత మూర్తి, ఆయన బంధువులు దాడి చేశారు. నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళ సుముఖంగా లేదు. అయితే, ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి మూర్తితోపాటు దాడి చేసిన అందరిని అరెస్టు చేశారు.