ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఓటర్ల వివరాల ధృవీకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో.. ఈ సవరణ గడువును పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి జులై 14తో ముగియాల్సిన ఈ గడువును, జులై 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వంద శాతం పనులు పూర్తి చేయడానికి మరింత సమయం కావాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చేసిన అభ్యర్థనకు ఈసీఐ సానుకూలంగా స్పందించింది.
రాష్ట్రవ్యాప్తంగా గత నెల రోజులుగా బూత్ లెవల్ అధికారులు (BLO) ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓటర్ల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, గడువు ముగిసే సమయానికి దాదాపు 88 శాతం మంది వివరాల డిజిటలైజేషన్ మాత్రమే సాధ్యమైంది. ఇంకా పెద్ద ఎత్తున పనులు పెండింగ్‌లో ఉండటం, రాజకీయ పార్టీల నుంచి కూడా విజ్ఞప్తులు రావడంతో అధికారులు గడువును పొడిగించక తప్పలేదు. ఈ అదనపు పది రోజుల సమయంలో మిగిలిపోయిన 9 శాతానికి పైగా ఉన్న డేటాను కూడా ఆన్‌లైన్ చేసి ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే, ఈ ఇంటింటి సర్వేలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 14.19 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు తేలింది. అలాగే ఉపాధి, వివాహాలు, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల మరో 12.14 లక్షల మంది ఓటర్లు తమ సొంత ప్రాంతాలను వదిలి శాశ్వతంగా వలస వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఇక బీఎల్‌ఓ(BLO)లు సర్వే కోసం ఇళ్లకు వెళ్లిన సమయంలో దాదాపు 7.26 లక్షల మంది ఓటర్లు స్థానికంగా అందుబాటులో లేరని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
గడువు పొడిగింపు నేపథ్యంలో ఎన్నికల సంఘం సవరించిన కొత్త షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. దీని ప్రకారం జులై 24తో ఎస్ఐఆర్(SIR) ప్రక్రియ ముగియనుంది. అనంతరం జులై 31వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారికంగా ప్రచురిస్తారు. ఈ ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ఓటర్లు తమ పేర్లను సరిచూసుకోవడానికి అవకాశం ఉంటుంది. జాబితాలో ఏవైనా తప్పులున్నా, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా మార్పులు చేర్పులు చేయాలన్నా జులై 31 నుండి ఆగస్టు 30 వరకు గడువు ఇచ్చారు. పౌరుల నుంచి వచ్చే ఈ అభ్యంతరాలు, దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పరిష్కరించడానికి సెప్టెంబరు 28 వరకు గడువు విధించారు. అన్ని రకాల తప్పులను సరిదిద్దిన తర్వాత, ఎలాంటి పొరపాట్లు లేని ఏపీ(AP) ఓటర్ల తుది జాబితాను అక్టోబరు 3వ తేదీన అధికారికంగా విడుదల చేయనున్నారు.