వైసీపీకి ఆఖరి పరీక్ష.. జ‌గ‌న్ గారు రెడీనా..?

admin
Published by Admin — July 13, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో మరో సంచలన సమరానికి తెరలేచింది. సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గకముందే.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ ముగిసిన వెంటనే, సెప్టెంబర్ ఆఖరు లేదా అక్టోబర్ లోపు స్థానిక పోరు ముగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెడ్‌లైన్ పెట్టేశారు. ఈ పరిణామం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌ను ఒక్కసారిగా హీటెక్కించింది. కూటమి పార్టీలకు ఇది ఉత్సాహాన్నిచ్చే అంశమే అయినా, ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి మాత్రం ఇది కోలుకోలేని దెబ్బ తీసే అగ్నిపరీక్షగా మారబోతోంది.

గత ఎన్నికల ఓటమి షాక్ నుంచి వైసీపీ(YCP) ఇంకా కోలుకోకముందే ఈ ఎన్నికలు రావడం ఆ పార్టీకి పెద్ద మైనస్. ముఖ్యంగా మూడు ప్రాంతాల (అమరావతి, ఉత్తరాంధ్ర, రాయలసీమ) అభివృద్ధి విషయంలో గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారేలా కనిపిస్తున్నాయి. అమరావతిని నిర్వీర్యం చేయడం, ఉత్తరాంధ్రకు కేవలం ప్రకటనలకే పరిమితం కావడం, రాయలసీమ పారిశ్రామికాభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూటమి నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా కుట్రలను, కులమతాల రాజకీయాన్ని ఎండగట్టాలని ఆయన స్పష్టం చేశారు.

అయితే, కూటమిలో అంతా సవ్యంగా ఉందా అంటే అదీ లేదు. కొందరు ఎమ్మెల్యేల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని గ్రహించిన చంద్రబాబు(Chandrababu), వారికి ఆగస్టులోనే ప్రత్యేకంగా క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యారు. తప్పులు సరిదిద్దుకుని స్థానిక పోరులో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఒకవైపు అధికార పక్షం ఇంత పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుంటే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

కూటమి దూకుడును అడ్డుకోవడానికి జగన్ దగ్గర ప్రత్యామ్నాయ ప్లాన్ ఉందా? లేక కేవలం పాత పద్ధతిలోనే కోర్టు కేసులు, స్టేల చుట్టూ రాజకీయాన్ని తిప్పుతారా? అనేది చూడాలి. ఎందుకంటే, ఈ స్థానిక ఎన్నికల ఫలితాలు కేవలం గెలుపోటములను మాత్రమే నిర్ణయించవు, అమరావతితో సహా ఏపీ భవిష్యత్తుపై గతంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు ఇచ్చే తుది తీర్పుగా నిలుస్తాయి. ఇందులో కూడా వైసీపీకి ఎదురుదెబ్బ తగిలితే, ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు మరింత అంధకారంలోకి వెళ్లడం ఖాయం. మరి ఈ ఆఖరి పరీక్షను ఎదుర్కొనేందుకు జగన్(Jagan) ఎంతవరకు రెడీగా ఉన్నారు? అన్న‌ది చూడాలి.

Tags
AP Local Body Elections AP Politics Chandrababu Naidu YS Jagan YSRCP TDP JanaSena Amaravati Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News