హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యువ పారిశ్రామికవేత్త నారా బ్రాహ్మణి(Nara Brahmani) జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ 'ఫార్చ్యూన్ ఇండియా' ప్రకటించిన 2026 దేశీయ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ ఉమెన్ (అత్యంత ప్రభావశీల మహిళలు) టాప్-100 జాబితాలో ఆమె చోటు సంపాదించుకున్నారు. వ్యాపార రంగంలో తిరుగులేని నాయకత్వ పటిమను ప్రదర్శిస్తూ, హెరిటేజ్ సంస్థను విజయపథంలో నడిపిస్తున్నందుకు గాను బ్రాహ్మణికి ఈ అరుదైన గౌరవం దక్కింది.
ఈ అద్భుత విజయంపై ఆమె భర్త, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. "ఫార్చ్యూన్ ఇండియా టాప్-100లో బ్రాహ్మణి నిలవడం నాకు ఎంతో గర్వకారణం. నీ ప్రయాణంలో ఇలాగే అన్ని అడ్డంకులను అధిగమిస్తూ, మరెంతో మందికి ఆదర్శంగా నిలవాలి" అంటూ ఎక్స్ వేదికగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. భార్య సాధించిన ఘనతపై లోకేశ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) సైతం తన కోడలిపై ప్రశంసల వర్షం కురిపించారు. బ్రాహ్మణి సాధించిన ఈ విజయం ఆమె అంకితభావానికి, లీడర్‌షిప్ క్వాలిటీస్‌కు నిదర్శనమని కొనియాడారు. "ఆమె మా కుటుంబానికి గర్వకారణంగా నిలవడమే కాకుండా.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలనుకునే మన తెలుగు ఆడబిడ్డలందరికీ ఒక గొప్ప స్ఫూర్తి" అని చంద్రబాబు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. జాతీయ స్థాయిలో తెలుగు మహిళ సత్తా చాటడంతో నారా అభిమానులు, తెలుగు ప్రజలు బ్రాహ్మణికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.