మళ్ళీ ‘ఆంధ్రా’ పంచాయితీ.. ఇంకెంతకాలం ఈ ఏడుపు క‌విత‌క్కా..?

admin
Published by Admin — July 10, 2026 in Politics, Andhra, Telangana
News Image

తెలంగాణ రాజకీయాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా, సొంత ఇంట్లో గొడవలు ముదిరినా వెంటనే పక్క రాష్ట్రం వైపు వేలెత్తి చూపించడం గులాబీ నేతలకు అలవాటుగా మారిందనే విమర్శలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. తాజాగా కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఒకప్పుడు ఉద్యమ సమయంలో తండ్రి కేసీఆర్ వాడిన ‘ఆంధ్రా సెంటిమెంట్’ అస్త్రాన్ని, ఇప్పుడు కూతురు కవిత తన రాజకీయ మనుగడ కోసం, సొంత అన్నలపై పోరాటం కోసం వాడుకోవాలని చూడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నిజానికి ఇప్పుడు కవితకు వచ్చిన సమస్య కాంగ్రెస్ ప్రభుత్వంతోనో, లేక మరేదో రాజకీయ ప్రత్యర్థితోనో కాదు. ఆమె పోరాటమంతా సొంత అన్న కేటీఆర్, బావ హరీష్ రావులపైనే అని స్పష్టంగా అర్థమవుతోంది. ‘టీఆర్ఎస్(TRS)’ అనే పేరును వాడుకోకుండా వారు తనను అడ్డుకుంటున్నారని, సోషల్ మీడియాలో తనపై మార్ఫింగ్ ఫోటోలతో ట్రోలింగ్ చేయిస్తున్నారని ఆమె స్వయంగా ఆరోపించారు. మరి సొంత కుటుంబంలో, సొంత పార్టీలో జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధానికి ఆంధ్రా ప్రజలకు ఏం సంబంధం? ``ఇది ఆంధ్రా కాదు అడ్డమైన తిట్లు తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి. సభ్యత సంస్కారం కలిగిన తెలంగాణ సమాజం`` అంటూ క‌విత మాట్లాడటం వెనుక అర్థం ఏంటని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు.

గతంలో కవిత ప్రసంగం ముగిసిందంటే ‘జై తెలంగాణ’ అనే నినాదం మార్మోగేది. కానీ ఇప్పుడు ఆ నినాదాన్ని పక్కనబెట్టి, ప్రతి కథలోనూ ‘ఆంధ్రా వాళ్లు’ అంటూ చులకనగా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడినో, ఆంధ్రా(Andhra) ప్రాంతాన్నో తిడితే తప్ప తెలంగాణలో రాజకీయం నడవదనే పాత ధోరణిలోనే ఆమె ఇంకా ఉండిపోయినట్లున్నారు. అధికారంలో ఉన్నప్పుడు లేని సెంటిమెంట్, పదవులు కోల్పోయి పార్టీలో ప్రాధాన్యత తగ్గాక మళ్లీ తెరపైకి రావడం వెనుక పొలిటికల్ మైలేజ్ కోసం ఆరాటపడటమే కారణమనే విమర్శలు వస్తున్నాయి.

రాజకీయంగా ఎదగడానికి సొంత బలాన్ని, సిద్ధాంతాలను నమ్ముకోవాలి కానీ, ప్రతిదానికీ పక్క రాష్ట్రంపై పడి ఏడవడం ఎంతవరకు సమంజసం? సభ్యత, సంస్కారం గురించి మాట్లాడే కవిత.. పక్క రాష్ట్ర ప్రజలను చులకన చేస్తూ మాట్లాడటం ఏ సంస్కారమో ఆలోచించుకోవాలి. తెలంగాణ(Telangana) ప్రజలు కూడా ఇప్పుడు ఎంతో చైతన్యవంతులయ్యారు. ఎవరు కేవలం సెంటిమెంట్‌ను అమ్ముకుని రాజకీయం చేయాలని చూస్తున్నారో, ఎవరు నిజంగా ప్రజల కోసం మాట్లాడుతున్నారో వారికి బాగా తెలుసు. 

Tags
Kavitha KTR BRS Andhra Sentiment Telangana Politics KCR Kalvakuntla Kavitha Andhra Pradesh
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News