ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అధ్యక్షతన కీలకమైన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పలు సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ భేటీ వేదికైంది. అయితే కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐదుగురు మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ ఐదుగురు మంత్రులు ఎక్కడికి వెళ్లారు? కేబినెట్ భేటీకి ఎందుకు దూరమయ్యారు?
మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరైన వారిలో అందరికంటే ముందుగా వినిపిస్తున్న పేరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ప్రస్తుతం ఆయన వైద్య చికిత్స నిమిత్తం ముంబై వెళ్లడంతో ఈ కీలక భేటీకి రాలేకపోయారు. మరోవైపు, రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో బిజీగా ఉండగా.. పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ అధికారిక పర్యటనపై అమెరికాలో ఉన్నారు. ఇలా ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ముగ్గురు నేతలు వేర్వేరు కారణాలతో అందుబాటులో లేకుండా పోయారు.
ఇక విదేశీ, వైద్య పర్యటనల్లో ఉన్న వారే కాకుండా, మరికొందరు మంత్రులు కూడా అనివార్య కారణాల వల్ల ఈ సమావేశానికి రాలేకపోయారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన కుటుంబంలో జరుగుతున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం కారణంగా లీవ్ తీసుకోగా.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas) తిరుపతి పర్యటనలో ఉన్నారు. అక్కడ కేంద్ర మంత్రితో కలిసి ముందుగా నిర్ణయించిన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సి రావడంతో ఆయన కూడా అమరావతికి రాలేకపోయారు. ఇలా రకరకాల కారణాలతో ఈ ఐదుగురు మంత్రులు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టాల్సి వచ్చింది.
మంత్రుల గైర్హాజరు ఒక ఎత్తయితే.. ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు మరో ఎత్తు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ఎన్‌ఐఏ (NIA) కేసుల వేగవంతమైన విచారణ కోసం విశాఖపట్నంలో రాష్ట్రవ్యాప్త అధికార పరిధితో కూడిన ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీనితో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వేసవి కాలంలో తలెత్తే తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపేలా చంద్రబాబు సర్కార్ భారీ నిధులను ప్రకటించబోతోంది. దాదాపు రూ. 11,166.81 కోట్ల వ్యయంతో భారీ తాగునీటి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇందులో భాగంగా రూ. 9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ పథకాలను, మరో రూ. 1,811.81 కోట్లతో సుమారు 2,943 ఇతర తాగునీటి పథకాలను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఐదుగురు మంత్రులు లేకపోయినప్పటికీ.. ఏపీ భవిష్యత్తును మార్చేలా ఈ కేబినెట్ భేటీ సాగుతుండటం గమనార్హం.