వైసీపీ అధినేత జగన్ రాజధాని విషయంలో చేసిన కీలక ప్రకటనపై పార్టీ నాయకులు, శ్రేణులు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎవరూ ఎక్కడా పన్నెత్తు మాట కూడా ఎత్తడం లేదు. తాము వస్తే.. మావిగనే రాజధాని అంటూ.. నాలుగు రోజుల కిందట జగన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. వచ్చే ఎన్నిక ల్లోనూ దీనిని తాము మేనిఫెస్టో(ఎన్నికల హామీల జాబితా)లో చేర్చుతామని కూడా జగన్ ప్రకటించారు. మావిగన్ కోరుకునే వారే.. తమకు ఓటే స్తారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
అయితే.. వాస్తవానికి పార్టీ అధినేత ఎవరిని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అదేసమయంలో సీనియర్లు, మాజీ మంత్రులు కూడా ఈ వ్యవహారంపై పెదవి విరుస్తున్నారు. ప్రజల కోసం... ప్రజల చేత .. అన్నట్టుగా వ్యవహరించాల్సిన కీలక పార్టీ ఇలా.. ఒంటెత్తు పోకడలు పోవడంపై సీమలోని రెడ్డి నాయకులు ఇప్పటికే విముఖత వ్యక్తం చేశారు. పోనీ.. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంలోఉ న్న నాయకులు అయినా దీనిని సమర్థిస్తున్నారా? అంటే ప్రశ్నగానే మిగిలింది.
ఫలితంగా ఎవరూ కూడా జగన్‌కు అనుకూలంగా కానీ, మావిగన్‌కు అనుకూలంగా కానీ.. ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మావిగన్ అనేది రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందని.. రాజధాని కోసం నియమించిన శివరామకృష్ణ కమిటీలోనూ ఉందని చెప్పారే తప్ప.. దీనికి సంబంధించిన ఆధారాలను ప్రశ్నించే సరికిఆయన కూడా ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేక పోయారు. ఫలితంగా జగన్ చేసిన ప్రకటన కంఠశోషగానే మారింది.
ఎందుకిలా?
మావిగన్ అని జగన్ చెబుతున్నా.. పార్టీ నాయకులు పట్టించుకోకపోవడానికి రీజన్.. ప్రజలు హర్షించకపోవ డమే. గతంలో మూడు రాజధానులు అని చెప్పినప్పుడు.. ప్రజలు పక్కన పెట్టారు. ఇప్పుడు మావిగన్ అని అంటుంటే మరింతగా జగన్ వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ పరిణామాలను గమనించకుండా ఒంటెత్తు పోకడలు పోతామని చెబుతున్న జగన్ వైఖరితో తమకు ఇబ్బంది అని మెజారిటీ నాయకులు ఆలోచన చేస్తున్నారు. అందుకే.. వారు వైసీపీ అధినేత చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదన్నట్టుగా మౌనంగా ఉంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.