సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై డిజిటల్ పోరాటం చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (Cockroach Janata Party)కి దేశ సర్వోన్నత న్యాయస్థానాల పరిధిలో భారీ ఊరట లభించింది. ఆ పార్టీ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన సీజేపీ ప్రధాన డిజిటల్ వేదిక మళ్లీ అందుబాటులోకి రానుంది.
గత మే నెలలో దేశాన్ని కుదిపేసిన నీట్-యూజీ(NEET-UG) పరీక్షల పేపర్ లీకేజీ ఉదంతంపై కాక్రోచ్ జనతా పార్టీ 'ఎక్స్' వేదికగా పెద్ద ఎత్తున ఉద్యమించింది. విద్యావ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ డిజిటల్ ఉద్యమం యువతలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకోవడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో విద్యార్థుల్లో అలజడి సృష్టిస్తున్నారనే నెపంతో, జాతీయ భద్రతా కారణాలను చూపిస్తూ ఐటీ చట్టం సెక్షన్ 69(A) కింద కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సీజేపీ ఖాతాను దేశంలో బ్లాక్ చేసింది.
ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ(Delhi) హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఇరుపక్షాల వాదనలు ఆసక్తికరంగా సాగాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా ఉండేందుకే ముందస్తు జాగ్రత్తగా ఆ అకౌంట్‌ను నిలిపివేసినట్లు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. అయితే, ప్రస్తుతం నీట్ పరీక్షల ప్రక్రియ పూర్తయినందున, ఆ ఖాతాను తిరిగి పునరుద్ధరించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం కోర్టుకు తెలపడం గమనార్హం. ప్రాథమిక కారణాలు ముగిసిపోయినందున వెంటనే అకౌంట్‌ను అన్‌బ్లాక్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ప్రధాన ఖాతాపై నిషేధం ఉన్నప్పటికీ, సీజేపీ(CJP) వెనక్కి తగ్గలేదు. ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ పేరుతో ప్రత్యామ్నాయ అకౌంట్‌ను తెరిచి, లక్షలాది మంది ఫాలోవర్లతో నిరుద్యోగం, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌లపై పోరాటాన్ని కొనసాగించింది. ఇప్పుడు కోర్టు తీర్పుతో పాత, ప్రధాన అకౌంట్ కూడా చేతికి రావడంతో ఈ డిజిటల్ యువజన ఉద్యమం మరింత వేగం పుంజుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తీర్పు సోషల్ మీడియాలో భావప్రకటనా స్వేచ్ఛకు దక్కిన విజయంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.