వైసీపీలో బొత్స కథ ముగిసిందా..?

admin
Published by Admin — July 04, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఏపీలో పీసీసీ చీఫ్‌గా, బలమైన కాపు సామాజికవర్గ నేతగా చక్రం తిప్పిన ఆయన.. నాడు ముఖ్యమంత్రి రేసులో నిలిచినంతటి సత్తా ఉన్న నాయకుడు. రాష్ట్ర విభజన అనంతరం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, మనుగడ కోసం ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. అటు విజయనగరం జిల్లాలో బలమైన లీడర్‌షిప్ కోసం వెతుకుతున్న జగన్‌కు బొత్స రాక పెద్ద ఊరటనిచ్చింది. ఈ కలయిక ఇరుపక్షాలకూ అప్పట్లో అనివార్యంగా మారింది. పార్టీలో చేరిన నాటి నుండి జగన్ క్యాబినెట్‌లో కీలకమైన మున్సిపల్, విద్యా శాఖల మంత్రిగా బొత్స తన మార్క్ రాజకీయాన్ని నడిపించారు.

కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2024 ఎన్నికల్లో వైసీపీ(YCP) ఓటమి పాలు కావడం, బొత్స సైతం ఓడిపోవడంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. అయినప్పటికీ జగన్ ఆయన సీనియారిటీని గౌరవించి, విశాఖ స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీగా గెలిపించి.. నేరుగా శాసనమండలిలో ప్రతిపక్ష నేత పదవిని అప్పగించారు. అసెంబ్లీకి వెళ్లకూడదనే వైఖరితో ఉన్న వైసీపీకి, మండలిలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బొత్స లాంటి సీనియర్ గొంతుక ఎంతో అవసరమైంది. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం వైసీపీలో బొత్స ప్రాధాన్యత తగ్గుతోందా? అనే అనుమానాలకు తావిస్తోంది.

ముఖ్యంగా, కొద్దిరోజుల క్రితం బడ్జెట్ సెషన్‌లో బొత్స అనారోగ్యానికి గురికావడం, ఆ తర్వాత ఆయన రాజకీయాలకు కొంత విరామం ఇవ్వడం వెనుక పెద్ద చర్చే నడిచింది. ఆయన స్థానంలో మరొకరిని విపక్ష నేతగా నియమిస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే, అనారోగ్యం నుంచి కోలుకుని బొత్స మళ్లీ మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా.. పార్టీ అధినేత జగన్‌తో ఆయనకు గ్యాప్ పెరిగిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రమాద బాధితులను పరామర్శించడానికి జగన్ వచ్చినప్పుడు.. ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉన్న బొత్స ఆయన పక్కన కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రత్యర్థి పార్టీలు సైతం రంగంలోకి దిగాయి. బీజేపీ(BJP) సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. వైసీపీలో బొత్సను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారని, కాపు నేతలకు ఆ పార్టీలో తగిన గుర్తింపు ఉండదనడానికి ఇదే నిదర్శనమని ఆయన సంచలన విమర్శలు చేశారు. నిజంగానే బొత్సను జగన్ దూరం పెడుతున్నారా? వైసీపీలో ఆయ‌న కథ ముగిసిందా..? అనే చ‌ర్చ ఊపందుకుంది. ఇక వచ్చే ఏడాది (2027 డిసెంబర్) వరకూ ఎమ్మెల్సీగా, విపక్ష నేతగా పదవీకాలం ఉన్న బొత్స భవిష్యత్ ప్రయాణం వైసీపీలో ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags
Botsa Satyanarayana YS Jagan YSRCP Andhra Pradesh AP Politics AP News
Recent Comments
Leave a Comment

Related News