కాకినాడ జిల్లా తుని(Tuni) మండలంలో జరిగిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సుమారు 25 రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ లభించకపోవడంతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా నిలిచింది. చిన్నారిని కనిపెట్టేందుకు అన్ని దారులూ వెతికిన పోలీసులు.. తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పాప గురించి సరైన సమాచారం అందించిన వారికి రూ. 1 లక్ష నగదు బహుమతిని అందజేస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
జ్ఞానేశ్వరి(Jnaneshwari) కోసం రంగంలోకి దిగిన 12 ప్రత్యేక పోలీస్ బృందాలు అడవులు, సమీప వాగులు, వంకలను జల్లెడ పట్టాయి. అటవీ జంతువుల దాడి జరిగిందా అనే అనుమానంతో ఘటనా స్థలంలో మాంసం, బొమ్మలను ఉంచి కూడా పరిశోధించారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే కూలీలకు సైతం పాప వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకకపోవడం గమనార్హం. పాప సమాచారం తెలిస్తే 9440796508, 9440796531, 9440796573 ఫోన్ నెంబర్లను సంప్రదించి సమాచారం ఇవ్వాలని తుని పోలీసులు కోరారు.
ఈ కేసులో మొదటి నుంచీ ఒక పెంపుడు కుక్క వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జూన్ 6వ తేదీ మధ్యాహ్నం వేళ ఇంటి ముందు ఆడుకుంటూ పాప కనిపించకుండా పోయిన సమయంలో, ఆ శునకం(Dog) కూడా ఆమెతో పాటే వెళ్లింది. అయితే, కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క ఒంటరిగా గ్రామానికి తిరిగి వచ్చింది. పాప అదృశ్యమైన రోజున ఆ కుక్క రోడ్డుపై తీవ్ర ఆందోళనతో అటు ఇటూ తిరుగుతున్న దృశ్యాలు స్థానిక ఆలయ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
తీరా ఆ కుక్క ద్వారా ఏమైనా ఆధారాలు దొరుకుతాయనుకుంటే, అది తిరిగి వచ్చిన కొద్దిరోజులకే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఈ కేసును మరింత జటిలం చేసింది. అటు కిడ్నాప్(Kidnap) కోణంలో దర్యాప్తు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. నెల రోజులు కావస్తున్నా అమాయక చిన్నారి జాడ తెలియకపోవడంతో, ఇప్పుడు ప్రజల నుంచి వచ్చే సమాచారమే ఈ మిస్టరీని ఛేదించడానికి ఏకైక మార్గంగా కనిపిస్తోంది.