గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో పురోగతి కనిపిస్తోంది. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని..మరో కానిస్టేబుల్ బాబూరావు సహకరించారని సిట్ అధికారులు నిర్ధారించారు. ఆ క్రమంలోనే అశోక్, నాని పోలీసుల ఎదుట నేడు లొంగిపోయారు. ఘటన జరిగిన నాటి నుంచి వారు పరారీలో ఉన్నారు. ఆ ఇద్దరూ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. వారితో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ బాబూరావును కూడా పోలీసులు నేడు అరెస్ట్ చేశారు.
మరోవైపు, సస్పెండ్ అయిన సీఐ నాగరాజును కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. నాగరాజును 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టును కోరారు. సీఐ నాగరాజు తరఫున కౌంటర్ దాఖలు చేయాలని ఆయన తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను జులై 1వ తేదీకి వాయిదా వేసింది.