కులాల కుమ్ములాటతో.. మురికి పట్టిన వ్యవస్థను బాగు చేసి.. రాజకీయ సాగులో నాణ్యమైన నాయకులను ప్రజలకు అందించాలన్న బృహత్తర లక్ష్యం ఒకవైపు. కులాలు తప్ప.. రాజకీయాల్లో ఏముందని చెబుతు న్న పార్టీలు కొన్ని మరోవైపు. ఇలా.. ఏపీ రాజకీయాలు సాగుతున్న నేపథ్యంలో కుల రహిత రాజకీయం కోసం.. సమాజం కోసం.. జనసేన అదినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నం.. ఏమేరకు ఫలిస్తుంది? అనేది ప్రశ్న.
ఆది నుంచి..
వాస్తవానికి రాజకీయాల్లో ఆది నుంచి కులాలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అయితే.. తర్వాత కాలంలో ముఖ్యంగా 2000 తర్వాత.. దేశవ్యాప్తంగా కులాలకు ప్రాధాన్యం పెరిగింది. అటు కేంద్రంలో రాజకీయాలు చేస్తున్న పార్టీలైనా.. ఇటు రాష్ట్రాల్లో అదికారంలోకి వస్తున్న పార్టీలైనా.. కులాలకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఇది తమకు లాభిస్తుందన్న తీరులోనే ఆయా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. దీంతో 2000 తర్వాత.. ఉమ్మడి ఏపీ నుంచి ప్రస్తుత ఏపీ వరకు రాజకీయాల్లో కుల ప్రస్తావన పెరిగింది.
ఓటు బ్యాంకు..
ఓటు బ్యాంకు విషయం రాజకీయాలకు అత్యంత కీలకం. ఎవరు ఎన్ని చెప్పినా.. అధికారంలోకి రావాలం టే.. ఆయా సామాజిక వర్గాలను మచ్చిక చేసుకుంటే తప్ప.. సాధ్యం కాదన్న ధోరణిలో ఉన్నారు. ఒకప్పు డు ఉన్న కుల రహిత సమైక్యత ఇప్పుడు లేదు. చివరకు వనభోజనాల విషయంలోనూ.. కులాల వారీగా విడిపోయిన పరిస్థితులు, పరిణామాలు సుస్పష్టం. ఏది జరిగినా.. ఏం జరిగినా.. దానికి కులం కార్డు తొడగని పార్టీ అంటూ.. ఏదీలేదు. అయితే.. ఇది ఆయా పార్టీలు ఉన్న స్థాయిని బట్టి మారుతోంది అంతే!
మార్పు సాధ్యమా?
పవన్ కల్యాణ్ చెబుతున్నట్టు మార్పు సాధ్యమా? కులాలకు అతీతంగా రాజకీయాలు సాగుతాయా? నా యకులు ఏకమవుతారా? అంటే.. ఇప్పట్లో అయితే.. దీనికి సమాధానం లేదనే చెప్పాలి. పవనే చెప్పినట్టు తాను ఒక అడుగు వేస్తే.. వంద మంది వెనక్కి లాగుతున్నట్టుగా.. రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతు న్న ప్రస్తుత కాలంలో మార్పు సాధ్యమా? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే.. ఎప్పటికైనా సాధ్యం కావొచ్చు.. అనే ధీమాతోనే ముందుకు సాగాల్సి ఉంటుంది తప్ప.. దీనిని నిరుత్సాహ పరచలేం.