బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ ఘటనపై విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చేపల మృతికి గల కారణాల కోసం శాస్త్రీయ పరిశోధనలు చేయాలని మెరైన్ సైంటిస్టులకు సూచించారు. ఆ ప్రాంతంలో నీటి నమూనాలు, చనిపోయిన చేపల శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించామని పవన్ కళ్యాణ్ కు అధికారులు తెలిపారు.
సముద్ర జీవ వైవిధ్యంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల జీవనోపాధి సంరక్షణ వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పవన్ చెప్పారు. బోయపాడు తీరంలో పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, శాస్త్రీయ నివేదికలు అందిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ యోగాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. యోగా తనలో లోతైన స్పష్టతను, అంతర్గత పరిపక్వతను అందించిందని పవన్ అన్నారు. తన జీవితంలో యోగా ఒక భాగమని చెప్పారు. భారత నాగరికతలో యోగా ఒక అంతర్భాగమని పవన్ అన్నారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక, అంతర్గత సమతుల్యతను యోగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.