ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతలకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త సాగు సీజన్ ప్రారంభ వేళ రైతులకు పెట్టుబడి కష్టాలు లేకుండా, ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava) – పీఎం కిసాన్' పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20వ తేదీన (శనివారం) అర్హులైన ప్రతి రైతు బ్యాంక్ ఖాతాలోనూ నేరుగా రూ.7,000 జమ కానున్నాయి.
ఈ విడత నిధుల విడుదలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్‌లో జరిగే భారీ బహిరంగ సభ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. అదే సమయంలో, ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగే అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వ వాటాను బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
ఈ పథకం కింద రైతులకు ఒకేసారి రెండు లాభాలు చేకూరనున్నాయి. శనివారం రైతుల ఖాతాల్లో పడే మొత్తం రూ.7,000 లలో అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 అందిస్తుండగా, పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రూ.2,000 అందిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన హామీ ప్రకారం.. ఏపీలో 'అన్నదాత సుఖీభవ' కింద ఏడాదికి రూ.14,000, కేంద్రం 'పీఎం కిసాన్(PM Kisan)' కింద ఇచ్చే రూ.6,000 కలిపి.. మొత్తంగా ఏడాదికి రూ.20,000 పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో అందిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధులు రైతుల ముంగిటకు వస్తున్నాయి.
ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని దాదాపు 46,85,838 మంది రైతు కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.3,125.47 కోట్లను సిద్ధం చేసింది. లబ్ధిదారులలో 45,69,817 మంది పట్టాదారు రైతు కుటుంబాలు ఉండగా, మరో 1,16,021 మంది అటవీ భూ సాగు హక్కుదారులు (ROFR) ఉన్నారు. రైతులకు విడుదల చేసే ఈ మొత్తం నిధులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.782.5 కోట్లను విడుదల చేస్తోంది. రేపు ఉదయం నుంచే రైతుల మొబైల్ ఫోన్లకు డబ్బులు జమ అయినట్లు మెసేజ్‌లు రానున్నాయి చూస్కోండి మరి.