తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సరికొత్త సవాల్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఖైరతాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. నోరు తెరిస్తే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్న సీఎం.. ఆ మాటలు పక్కన పెట్టి కనీసం వారిని లక్షాధికారులైనా చేయాలని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కేటీఆర్ ఈ సందర్భంగా గట్టిగా నిలదీశారు. ముఖ్యంగా ఆడబిడ్డలకు ఇస్తామన్న నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మహిళలకు ఇవ్వాల్సిన ఆ ఆర్థిక సహాయం బాకీల రూపంలో దాదాపు లక్షన్నర రూపాయలకు చేరిందని ఆయన లెక్కగట్టారు. "సీఎం రేవంత్ రెడ్డి గారు.. మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మహిళకు ఆ రూ. లక్షన్నర బాకీని వెంటనే చెల్లించండి.. మీరు ఆ పని చేస్తే నేను రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా" అంటూ కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
అలాగే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మార్క్ పాలనపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దాదాపు రెండున్నర లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించి ఆదుకుంటే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న గూడును కూడా లాగేసుకుంటోందని మండిపడ్డారు. 'హైడ్రా' పేరుతో వందలాది ఇళ్లను కూల్చివేస్తూ, పేద కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గరీబోళ్ల కడుపు కొడుతున్న రేవంత్ సర్కార్.. డిజాస్టర్ ప్రభుత్వంగా మిగిలిపోతుందని విమర్శించారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇస్తామన్న రూ. 4 వేల పెన్షన్, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ వంటి ప్రతిష్టాత్మక హామీలు ఏమయ్యాయని కేటీఆర్ నిలదీశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.