కాక్రోచ్ పార్టీలోకి ప్ర‌కాశ్ రాజ్‌..!

admin
Published by Admin — June 14, 2026 in Politics, National
News Image

సినీ నటుడు, విలక్షణ పర్ఫార్మర్ ప్రకాశ్ రాజ్ ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఒక సంచలనం ఉంటుంది. ముఖ్యంగా సామాజిక అంశాలపై, ప్రభుత్వాల వైఫల్యాలపై ఆయన గళమెత్తే తీరు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. ఇప్పుడు తాజాగా ఆయన "కాక్రోచ్ జనతా పార్టీ" (CJP) వైపు అడుగులు వేయడం రాజకీయ, సామాజిక వర్గాల్లో పెను సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటమే లక్ష్యంగా పుట్టుకొచ్చిన ఈ సరికొత్త ఉద్యమంలోకి ప్రకాశ్ రాజ్ ఎంట్రీ ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న నీట్-యూజీ పరీక్షల నిర్వహణ లోపాలు, పేపర్ లీకేజీల వ్యవహారంపై విద్యార్థి లోకం భగ్గుమంటోంది. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక, భవిష్యత్తు శూన్యంగా మారి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైనంపై యువత తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ "కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Party)" ఆధ్వర్యంలో యువత దేశవ్యాప్త పోరాటానికి తెరలేపింది. ఢిల్లీ నుంచి లక్నో వరకు, పుణె నుంచి హైదరాబాద్ వరకు ఇప్పటికే ఈ ఉద్యమం పాకింది.

ఈ క్రమంలోనే బెంగళూరు(Bengaluru)లోని ఫ్రీడమ్ పార్క్‌లో ఆదివారం జరగబోయే భారీ నిరసన కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్ తన పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు, యువత ఆవేదనకు అండగా నిలిచేందుకు తాను స్వయంగా బెంగళూరు వస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. "ప్రభుత్వాన్ని జవాబుదారీ చేద్దాం.. అందరూ తరలిరండి" అంటూ తన మార్క్ హాష్‌ట్యాగ్ #JustAsking తో ఆయన సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన పిలుపు ఇప్పుడు నెట్టింట మారుమోగుతోంది.

ఇప్పటికే హైదరాబాద్‌లో జరిగిన ఈ తరహా ఆందోళనకు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలపగా.. ఇప్పుడు బెంగళూరు వేదికగా ప్రకాశ్ రాజ్ ఈ ఉద్యమ పగ్గాలు అందుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చేతిలో రాజ్యాంగం, జాతీయ జెండాలతో శాంతియుతంగా సాగుతున్న ఈ "కాక్రోచ్" ఉద్యమం.. ప్రకాశ్ రాజ్(Prakash Raj) రాకతో సరికొత్త మైలేజీని సొంతం చేసుకుంది. విద్యావ్యవస్థలోని లోపాలను ఎండగట్టేందుకు యువతతో కలిసి ఆయన వేయబోయే తదుపరి అడుగులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.

Tags
Prakash Raj Just Asking Cockroach Janata Party CJP NEET Scam Bengaluru
Recent Comments
Leave a Comment

Related News