జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ స్థాయికి చేరేందుకు ఎన్ని కష్టాలు పడ్డారో.. తనకు బాగా తెలుసునని.. ఆయన సతీమణి అన్నా లెజినోవా పేర్కొన్నారు. ఆయన చేసిన ఒంటరి పోరాటం తలుచుకుంటే.. చాలా బాధేస్తుందని తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పవన్ సతీమణి ఇన్ స్టాలో పోస్టు చేశారు. నాటి ఫొటోలను కూడా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అనేక విషయాలను పంచుకున్నారు.
ఎన్నెన్నో దూషణలు..
``పవన్ కల్యాణ్ సినిమాల్లో ఉండగా ఆదరించిన వారే.. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక.. దూషించారు. ఎన్నో ఆరోపణలు చేశా రు. వ్యక్తిగతంగా, మానసికంగా కూడా ఆయన ఆవేదనకు గురయ్యేలా చేశారు`` అని అన్నా వివరించారు. డిప్యూటీ సీఎంగా ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక.. ఆయన అనేక కష్టాలతో కూడిన ప్రయాణం చేశారని.. దీనిని తాను ప్రత్యక్షంగా చూశా నని ఆమె తెలిపారు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ ఏదో ఫ్రీగా వచ్చేశారని అనుకుంటే పొరపాటేనన్నారు. అనే అవమానాలు.. ఒకానొక దశలో అనిశ్చిత పరిస్థితిని కూడా ఆయన ఎదుర్కొన్నారని.. ఇవన్నీ దాటుకుని వచ్చారని తెలిపారు.
ఓటమి మాత్రమే కాదు..
2019 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పవన్ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్న.. అన్నా.. ఓటమితో ఒక ఆవేదన మాత్రమే పవన్‌కు మిగల్లేదన్నారు. ఆయన నమ్ముకున్న వారు కూడా ఆయనను వదిలి వెళ్లిపోవడం తీవ్రంగా బాధించిందన్నారు. కానీ.. ఇవేవీ బయటి వారికి కనిపించకుండా ఆయన మనసులోనే దాచుకున్నట్టు తెలిపారు. పైకి చిరునవ్వులు.. చిందించినా.. ఎన్నో ఓటములను ఆయన ఎన్నికలకు ముందు చవిచూశారని చెప్పారు. గత ఎన్నికల్లో విజయం సాధించడం అంటే.. అంతతేలికగా జరగలేదన్నారు.
ప్రపంచమంతా..
ఒకానొక దశలో ప్రపంచం మొత్తం పవన్ కు వ్యతిరేకంగా మారిపోయిందని అన్నా గుర్తు చేసుకున్నారు. ``కొందరు ఎగతాళి చేశారు. మరికొందరు ప్రశ్నించారు. అయినా.. ఆయన వెన్ను చూపకుండా ముందుకే సాగారు.`` అని అన్నా అన్నారు. ఆయన బయటకు వెళ్లి రాజకీయాలు చేస్తే.. తాను ఇంట్లో కుటుంబ బాధ్యతలు చూసేదాన్నని.. అయితే.. లోలోన ఒంటరి అవుతానేమోనన్న భయం వెంటాడిందని పేర్కొన్నారు. అయితే.. ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించానన్నారు. కొన్ని సార్లు ఒంటరి అన్న భావన కలిగేదని తెలిపారు.
అది మానవతా విజయం
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తోపాటు.. 20 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, అయితే.. అది కేవలం రాజకీయంగా దక్కిన విజయం మాత్రమే కాదని తెలిపారు. ప్రజలు చూపిన మానవతా విజయమని .. పవన్ కల్యాణ్ ఏళ్ల తరబడి అనుభవించిన వేదన విజ యంగా రూపుదాల్చిన క్షణమని పేర్కొన్నారు. ఆ సమయంలో తన కళ్లు సుడిగుండాలుగా మారాయని అన్నా పేర్కొన్నారు. ``నా కన్నీళ్లు మోడీ కూడా చూశారు`` అని అన్నా తెలిపారు. ``ఎప్పుడూ వెనకడుగు వేయని ఆ వ్యక్తి పట్ల నాకు ఆ క్షణంలో ఎంతో గర్వంగా అనిపించింది`` అని పవన్‌పై తన ప్రేమను చాటుకున్నారు అన్నా.