హామీ ఇచ్చారు.. కొడాలి బ‌య‌ట‌కు వ‌చ్చారు.. !

admin
Published by Admin — June 12, 2026 in Politics, Andhra
News Image

దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కొడాలి నాని(Kodali Nani) బయ‌ట‌కు వ‌చ్చారు. వైసీపీ చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ` వెన్నుపోటుకు రెండేళ్లు` పేరుతో వైసీపీ నిర్వ‌హించిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో గుడివాడలో కొడాలి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కూడా.. కొడాలి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 2029 ఎన్నికల్లో ప్రజలు పరశురాముడి గొడ్డలిని జగన్ మోహన్ రెడ్డికి అందిస్తారని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కృష్ణా జిల్లా గుడివాడ(Gudivada)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రభుత్వ వైఫల్యాలపై నిర‌స‌న‌గా ఈ ర్యాలీ చేపట్టారు. ఏలూరు రోడ్డు నుండి మార్కెట్ సెంటర్ వరకు సాగిన ఈ నిరసన ప్రదర్శనలో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొడాలి నాని(Kodali Nani) మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని నాని మండిపడ్డారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ మాటను గాలికొదిలేశారని నిరుద్యోగులకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసి నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం చలగాటమాడుతుందని ఆరోపించారు.

అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కొడాలి బ‌య‌ట‌కు రావ‌డం వెనుక‌.. కీల‌క‌హామీ ఆయ‌న‌కు ల‌భించింద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌ర్వాత‌.. గుడివాడ‌లో రెండేళ్లుగా పార్టీ త‌ర‌ఫున ఎలాంటి కార్య‌క్ర‌మాలూ చేప‌ట్ట‌లేదు. దీనికితోడు కొడాలి తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. దీంతో గుడివాడ‌లో వ‌చ్చే ఎన్నికల నాటికి వేరే అభ్య‌ర్థిని నిల‌బెట్టేలా వైసీపీ(YCP) మంత్రాంగం జ‌రిపింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. దీంతో నాని కూడా పార్టీకి దూరంగా ఉంటూ వ‌చ్చారు. అయితే.. ఇటీవ‌ల మరో మాజీ మంత్రి పేర్ని నాని మ‌ధ్య‌వ‌ర్తిత్వంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుడివాడ సీటును కొడాలికే ఇచ్చేలా.. వైసీపీని ఆయ‌న ఒప్పించార‌ని.. అందుకే కొడాలి యాక్టివేట్ అయ్యార‌ని అంటున్నారు.

Tags
Kodali Nani YS Jagan AP News AP Politics Andhra Pradesh YSRCP
Recent Comments
Leave a Comment

Related News