ష‌ర్మిల‌కు డ‌బుల్ షాక్‌.. ఆ ప‌ద‌వి కూడా అవుట్‌..!

admin
Published by Admin — June 06, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల(YS Sharmila) చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆమెకు ఏదో ఒక ఉన్నత పదవి దక్కుతుందని, ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం వస్తుందని అందరూ భావించారు. ఈ క్రమంలోనే ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దాదాపు ఖాయమంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం సాగింది. దీంతో వైఎస్సార్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఆమెకు ముందస్తు అభినందనలు కూడా తెలియజేశారు. ఆరేళ్ల పాటు పెద్దల సభలో ఉంటూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని ఆశించారు. కానీ, అనూహ్యంగా ఆ సీటు చేజారినట్లు తెలుస్తోంది. హైకమాండ్ తుది జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో షర్మిలకు తొలి షాక్ తగిలినట్లయింది.

ఇక ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఆమెకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగలనుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె నిర్వహిస్తున్న ఏపీ(AP) పీసీసీ చీఫ్ పదవి కూడా చేతులు మారబోతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో గట్టిగా ప్రచారం సాగుతోంది. షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని అధిష్టానం ఆశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రాలేదనే భావనలో పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓట్ల శాతాన్ని పెంచడంలో గానీ, వైఎస్ జగన్ ఓటు బ్యాంకును ఆకర్షించడంలో గానీ ఆశించిన మేర సక్సెస్ కాలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను ఏపీ బాధ్యతల నుంచి తప్పించి, కేంద్ర పార్టీ లైన్‌లోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధినాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ పగ్గాలను ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ బీసీ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి(Killi Kruparani)కి అప్పగించేందుకు హైకమాండ్ ముగ్గు చూపుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు రాయలసీమ, గోదావరి జిల్లాలకే పరిమితమైన పీసీసీ చీఫ్ పదవిని, ఈసారి బీసీల కోట అయిన ఉత్తరాంధ్రాకు ఇవ్వడం ద్వారా పార్టీకి కొత్త ఊపు తీసుకురావచ్చని భావిస్తున్నారు. అందరినీ కలుపుకుపోయే తత్వంతో పాటు, కూటమి ప్రభుత్వంపై గట్టిగా వాయిస్ వినిపించే సామర్థ్యం కృపారాణికి ఉందని అధిష్టానం నమ్ముతోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. అటు రాజ్యసభ సీటు దక్కక, ఇటు పీసీసీ చీఫ్ పదవి కూడా పోయి షర్మిలకు డబుల్ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ రాజకీయ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Tags
YS Sharmila AP Congress AP Politics Killi Kruparani Congress Andhra Pradesh AP PCC Chief Rajya Sabha
Recent Comments
Leave a Comment

Related News