రాజకీయాల్లో కాంగ్రెస్(Congress) పార్టీ స్ట్రాటజీలు ఎప్పుడూ అంత సులభంగా అర్థం కావు. ఒకవైపు ఆశలు కల్పిస్తూనే, మరోవైపు ఊహించని షాక్‌లు ఇవ్వడంలో ఆ పార్టీ అధిష్టానానిది ప్రత్యేక శైలి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విషయంలోనూ ఇదే రిపీట్ అయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఢిల్లీ వేదికగా జరిగిన పరిణామాలు, ఆ తర్వాత వెలువడిన నిర్ణయాలు చూస్తుంటే.. కాంగ్రెస్ ఆడిన మైండ్ గేమ్‌లో షర్మిల రాజ్యసభ ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లినట్లు స్పష్టమవుతోంది.
వైఎస్ షర్మిల(YS Sharmila) ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచే ఆమెకు రాజ్యసభ సీటు గ్యారెంటీ అనే ప్రచారం జోరుగా సాగింది. కర్నాటక కోటా నుంచి ఆమెను ఎగువ సభకు పంపుతారని సొంత పార్టీ నేతలే ముందస్తు శుభాకాంక్షలు కూడా చెప్పుకున్నారు. దీనికి తోడు ఇటీవల రాహుల్ గాంధీని షర్మిల దంపతులు ప్రత్యేకంగా కలవడంతో.. సీటు దాదాపు ఖాయమనే సంకేతాలు వెళ్లాయి. బాధ్యతలు అప్పగించేటప్పుడే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి రాహుల్ సిద్ధమయ్యారని అందరూ భావించారు.
కట్ చేస్తే కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ(Rajya Sabha) అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో సీన్ రివర్స్ అయింది. కర్నాటక నుంచి మల్లిఖార్జున ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీఖాన్ వంటి పేర్లు తెరపైకి వచ్చాయి కానీ, షర్మిల పేరు మాత్రం ఎక్కడా కనిపించలేదు. చివరి నిమిషంలో ఆమె పేరు గల్లంతు కావడం వెనుక అధిష్టానం పక్కా పొలిటికల్ లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. కేవలం ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చే నిర్ణయాల కంటే, పార్టీకి వచ్చే మైలేజ్‌కే హైకమాండ్ మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది.
ఈ ట్విస్ట్ వెనుక ఏపీ(AP) కాంగ్రెస్ సీనియర్ నేతల చక్రం తిప్పినట్లు టాక్ నడుస్తోంది. షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తే పొలిటికల్ గా ఏపీలో పార్టీకి వచ్చే ప్రయోజనం శూన్యమని, పైగా దీనివల్ల టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే పరోక్షంగా లాభం చేకూరుతుందని కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ అంతర్గత సమీకరణాలు, విశ్లేషణల తర్వాతే కాంగ్రెస్ పెద్దలు షర్మిల పేరును పక్కన పెట్టారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి హైకమాండ్ మార్క్ మైండ్ గేమ్‌తో షర్మిలను పార్లమెంట్‌కు పంపే వ్యూహం ప్రస్తుతానికైతే బెడిసికొట్టింది.