సుదీర్ఘ రాజకీయ అనుభవం, నాలుగు దశాబ్దాల ప్రస్థానం, పార్టీలో అత్యంత కీలకమైన పాత్క.. ఇవన్నీ ఒక ఎత్తయితే, పొలిటికల్ కెరీర్ ఎండింగ్‌లో పార్లమెంట్ మెట్లు ఎక్కాలనే ఒకే ఒక్క కల మరో ఎత్తు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) పరిస్థితి చూస్తుంటే.. ఆయన లైఫ్ టైమ్ డ్రీమ్ అయిన రాజ్యసభ ఆశలపై నీళ్లు చల్లబడినట్లేనా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
1980ల నాటి ఎన్టీఆర్ కాలం నుండి నేటి చంద్రబాబు యుగం వరకు టీడీపీ(TDP)లో యనమల పోషించిన పాత్ర అసాధారణం. ఆర్థిక మంత్రిగా రాష్ట్ర బడ్జెట్‌ను ఇష్టారాజ్యంగా కాకుండా ఒక క్రమశిక్షణతో నడిపించిన ట్రాక్ రికార్డ్ ఆయనది. అలాగే అసెంబ్లీ వ్యవహారాల నిర్వహణలో గానీ, సభాధిపతిగా స్పీకర్ కుర్చీలో కూర్చుని హుందాతనాన్ని కాపాడటంలో గానీ ఆయన రూటే వేరు. గత ఏడాది మార్చిలోనే ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. అయితే, చట్టసభల్లో ఎంతో అనుభవమున్న యనమలకు ఢిల్లీలోని పెద్దల సభ రాజ్యసభకు వెళ్లాలనేది చాలా కాలంగా ఉన్న ఏకైక కోరిక.
ప్రస్తుతం యనమల వయసు 75 ఏళ్లు దాటింది. ఇప్పుడు గానీ రాజ్యసభ సీటు దక్కకపోతే, మళ్లీ 2028 దాకా వేచి చూడాలి. అప్పటికి ఆయనకు 80 ఏళ్లకు చేరువవుతారు కాబట్టి, గౌరవప్రదంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని ఆయన భావించారు.
ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు టీడీపీకి దక్కే అవకాశం ఉండటంతో, అందులో ఒక సీటు తనకే వస్తుందని యనమల గట్టిగా ఆశపడ్డారు. కానీ, ఇటీవల జరిగిన మహానాడులో తీర్మానాల కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయనకు, వేదికపైనే అసలు సీన్ ఏంటో అర్థమైపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, ఆ మహానాడు(Mahanadu) వేదికగానే యువతకు, మహిళలకు సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం ప్రాధాన్యత ఇస్తామని పార్టీ ప్రకటించింది. అంటే సీనియర్ల కాలం ముగిసిందని, ఇక యువ రక్తాన్ని ఎక్కించాలనే బలమైన సంకేతాన్ని అధిష్ఠానం పరోక్షంగా ఇచ్చేసింది.
ప్రస్తుతం నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐ-టీడీపీ చైర్మన్ విజయ్, సానా సతీష్, కిలారి రాజేష్ వంటి యువ నేతల పేర్లు రాజ్యసభ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న ఈ కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలని లోకేష్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త తరం సమీకరణాల మధ్య, యనమల వంటి సీనియర్లకు స్థానం దక్కడం దాదాపు అసాధ్యమనే టాక్ నడుస్తోంది. మహానాడు తర్వాత యనమల రామకృష్ణుడు పెద్దగా మీడియా ముందుకు రాకపోవడానికి, పూర్తిగా సైలెంట్ అయిపోవడానికి కారణం కూడా ఈ మారిన పొలిటికల్ ట్రెండేనని తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. మరి చంద్రబాబు(Chandrababu) తన పాత మిత్రుడి ఆఖరి కోరికను మన్నిస్తారా.. లేక లోకేష్ యువ మార్గంలోనే పయనిస్తారా అనేది చూడాలి.