బీఆర్ ఎస్‌కు రేవంత్ రెడ్డి బిగ్ సవాల్‌.. !

admin
Published by Admin — May 31, 2026 in Telangana
News Image

తెలంగాణ రాజ‌కీయాలు మ‌రింత కాక తేలాయి. వ‌డ్ల కొనుగోళ్లు, రైతుల‌కు ఉచిత విద్యుత్ వంటి అంశాల‌పై ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌లు.. మీడియాలో హైలెట్ అవుతున్నాయి. దీంతో ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌హా పొన్నం ప్ర‌భాక‌ర్ వంటివారు మీడియాముందుకు వ‌చ్చి స‌మాధానం చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. బీఆర్ ఎస్ నాయ‌కుల ప్ర‌చారం మాత్రం ఆగ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న స‌మ‌స్య‌లు.. వాస్త‌వాల‌ను ఆయ‌న వివ‌రించారు. ఈ క్ర‌మంలో బీఆర్ ఎస్ పార్టీకి గ‌ట్టి స‌వాలే రువ్వారు.

త‌మ ప్ర‌భుత్వంలో రైతుల‌ను రాజుల లెక్క చూస్తున్నామ‌ని సీఎం అన్నారు. వారికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు. అలానే ప్ర‌తి సీజ‌న్‌కు ముందుగానే నీటిని విడుదల చేస్తూ.. రైతుల‌ను ఆదుకుంటున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. బీఆర్ ఎస్ నేత‌లు చేసే ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని చెప్పారు. ఒక‌వేళ‌.. త‌మ హ‌యాంలో రైతులు వాడే నీటికి మోటార్లు పెట్టి... లెక్క‌క‌ట్టి.. వారి నుంచి సొమ్ములు వ‌సూలు చేసినా.. లేక‌, ఉచిత విద్యుత్‌ను నిలిపివేసినా.. తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ నుంచి కూడా త‌ప్పుకొంటామ‌ని చెప్పారు. ఇదేస‌మ‌యంలో బీఆర్ ఎస్ నాయ‌కులు కూడా పోటీకి దూరంగా ఉంటారా? అని స‌వాల్ రువ్వారు.

ఇది ఇందిర‌మ్మ ప్ర‌భుత్వ‌మ‌ని.. ఇక్క‌డ చెప్పింది అమ‌ల‌వుతుంద‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. త‌మ హ‌యాంలో వ‌చ్చే రెండున్న‌రేళ్లూ.. రైతుల‌ను క‌డుపులో పెట్టుకుని చూస్తామ‌న్నారు. ఉచిత విద్యుత్ అందిస్తామ‌న్నారు. అలానే.. రైతులు వాడే నీటికి మోటార్ల‌ను బిగించేది లేద‌ని అన్నారు. ఇవ‌న్నీ చేస్తే.. బీఆర్ ఎస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండాల‌ని అన్నారు. రైతుల‌ను ఆదుకునేందుకు చేతులు రాని వారు కూడా.. ఇప్పుడు మాట్లాడుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ``ప‌ది సంవ‌త్స‌రాలు అధికారంలో ఉన్నారు. అప్పుడు ఏం చేశారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు. ద‌మ్ముంటే.. నేను విసిరిన స‌వాల్‌కు రెడీ అవ్వండి`` అని రేవంత్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ష‌ర‌తులు లేకుండానే రైతుల‌కు 24 గంట‌ల పాటు ఉచితంగా విద్యుత్‌ను అంందిస్తున్న‌ట్టు సీఎం చెప్పా రు. దీనికి గాను ప్ర‌త్యేకంగా రైతు డిస్క‌మ్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఉచిత విద్యుత్ క‌నెక్ష‌న్ల‌ను దీనికి అనుసంధానం చేస్తామ‌ని చెప్పారు. ఇదేస‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వం అప్పులు మాత్ర‌మే చేసింద‌ని.. ఇప్పుడు తాము వాటికి వ‌డ్డీలు చెల్లిస్తున్నామ‌ని తెలిపారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అప్పులు చేస్తోంద‌ని చెబుతున్న బీఆర్ ఎస్ నాయ‌కులు త‌మ హ‌యాంలో ఎన్ని అప్పులు చేశారో.. చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తాము ముందుగానే అప్పుల‌పై ప్ర‌క‌ట‌న చేసి.. ప్ర‌జ‌ల‌కు పార‌ద‌ర్శ‌క పాల‌న అందిస్తున్నామ‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. 

Tags
Brs cm revanth reddy challenge
Recent Comments
Leave a Comment

Related News