తెలుగు రాష్ట్రాల రాజకీయాలంటేనే హై ఓల్టేజ్ డ్రామా. సవాల్-ప్రతిసవాళ్లు, హోరాహోరీ పోరాటాలు ఇక్కడ సర్వసాధారణం. అయితే, ఈ రాజకీయ యుద్ధం కేవలం క్షేత్రస్థాయిలోనే కాదు.. బ్యాంక్ అకౌంట్లలోనూ అంతే జోరుగా సాగిందని తాజాగా వెల్లడైన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన నివేదిక ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటిలోకీ తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డు సృష్టించగా, ఖర్చుల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.
రాజకీయ వ్యూహాల్లోనే కాదు, పార్టీకి నిధులు సమకూర్చడంలోనూ చంద్రబాబు నాయుడు మార్క్ మరోసారి స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ వెనక్కి నెట్టి, అత్యధిక ఆదాయం గడించిన నంబర్ వన్ రీజినల్ పార్టీగా టీడీపీ(TDP) నిలిచింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీ ఖాతాలోకి ఏకంగా రూ. 228.31 కోట్లు వచ్చి చేరాయి. ఎన్నికల వేళ కార్పొరేట్ దిగ్గజాలు, భారీ విరాళాలు తెలుగుదేశం వైపు క్యూ కట్టడంతో ఆదాయంలో ఈ స్థాయి రికార్డు సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (రూ. 219 కోట్లు) రెండో స్థానంలో నిలవగా, వైఎస్సార్‌సీపీ రూ. 140 కోట్ల ఆదాయంతో మూడో స్థానానికి పరిమితమైంది.
ఇక ఖర్చుల విషయానికి వస్తే సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆదాయంలో మూడో స్థానంలో ఉన్న వైసీపీ(YCP), ఖర్చు చేయడంలో మాత్రం దేశంలోని మిగిలిన పార్టీలకు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది. గడిచిన ఏడాదిలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఏకంగా రూ. 340.20 కోట్లు ఖర్చు చేసింది. తమకు వచ్చిన రూ. 140 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఎన్నికల ప్రచారం, అడ్వర్టైజ్‌మెంట్లు, వ్యూహాత్మక ఖర్చుల కోసం పార్టీ వెనకడుగు వేయకుండా భారీగా నిధులు గుమ్మరించినట్లు ఈ లెక్కలు చూస్తే అర్థమవుతోంది.
సాధారణంగా ఎన్నికల ఏడాది వచ్చిందంటే రాజకీయ పార్టీల ఖజానాలు కళకళలాడుతుంటాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. ఏపీ(AP) ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీలకూ కార్పొరేట్ నిధులు భారీగా ప్రవహించాయి. ఒకవైపు టీడీపీ గెలుపు గుర్రంగా నిలిచి నిధుల సేకరణలో టాప్‌లో నిలిస్తే.. మరోవైపు వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టి రికార్డు సృష్టించింది. ఏదేమైనా.. ఆదాయంలో తమ్ముళ్లు, ఖర్చులో వైసిపి నేతలు చూపించిన ఈ జోరు ఇప్పుడు భారతీయ రాజకీయాల్లోనే అత్యంత ఖరీదైన చర్చకు తెరలేపింది.