మూడు రంగుల జాతీయ పతాకం.. దేశానికి గర్వకారణమైతే.. పసుపు జెండా.. తెలుగు వారికి గర్వకారణ మని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన పార్టీ.. వారిలో ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంచిందన్నారు. తెలుగు వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న పార్టీ ఇప్పటికే అనేక రూపాల్లో తెలుగు వారికి అంకితమైందన్నారు. ప్రతి ఒక్క తెలుగు వారి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు.
ఈ దఫా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దీంతో మహానాడుకు వాహనాల జోరు తగ్గిందన్న ఆయన... కార్యకర్తల జోరు మాత్రం తగ్గలేద న్నారు. అందుకే.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలోనూ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని.. వారిని చూస్తే.. పార్టీ మరో 100 ఏళ్లపాటు పదిలంగా ఉంటుందన్న భావన కలుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో అంకిత భావంతో మహానాడుకు హాజరయ్యారని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ పరంగా ఎన్టీఆర్ హయాం నుంచి ప్రస్తుత కూటమి వరకు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు వివరించారు. ముఖ్యంగా ఈ మహానాడును మహిళలకు అంకితం చేస్తు న్నామని వివరించారు. కూటమిపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. పాలన చేస్తున్నామన్నారు. నరహంతకులతో మనం రాజకీయాలు చేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
సూపర్ సిక్స్ హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. మహిళలకు ఏటా మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. మహిళారిజర్వేషన్లను కూడా తీసుకు వచ్చి.. చరిత్ర సృష్టిస్తామని వెల్లడించారు. ఎవరు ఇచ్చినా.. ఇవ్వకున్నా.. మహిళలకు పార్టీ పరంగా.. ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో యువతకు భారీ ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు.