తెలుగుదేశం పార్టీలో అత్యంత నమ్మకస్తుడైన, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానం ఉన్న సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు(Chintakayala Ayyanna Patrudu) కుటుంబంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పొలిటికల్ మూవ్‌మెంట్ కనిపిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఎన్టీఆర్ జమానా నుంచి చంద్రబాబు వరకు వెన్ను చూపని బంటుగా నిలిచిన అయ్యన్న.. ఈ 2024 ఎన్నికలే తన చివరి ఎన్నికలని, 2029లో తాను తప్పుకుంటానని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన వారసుడిగా పెద్ద కుమారుడు, ఐ టీడీపీ ఇంచార్జ్ అయిన చింతకాయల విజయ్ నర్శీపట్నం నుంచి బరిలోకి దిగుతారని అందరూ భావించారు. కానీ, అంతకంటే ముందే చంద్రబాబు నాయుడు విజయ్‌కు ఒక ఊహించని బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జూన్ నాటికి ఖాళీ అవుతున్న నాలుగు సీట్లు కూటమికే దక్కనుండగా.. అందులో మూడు స్థానాలను టీడీపీ దక్కించుకోనుంది. ప్రాంతాల వారీగా సమీకరణలు చూస్తే, ఉత్తరాంధ్ర కోటాలో ఒక బలమైన బీసీ యువ నేతను ఢిల్లీకి పంపాలని చంద్రబాబు స్కెచ్ వేశారు. ఈ రేసులోనే చింతకాయల విజయ్(Chintakayala Vijay) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని, ఐటీ రంగంపై అవగాహన ఉన్న విజయ్‌ను పెద్దల సభకు పంపితే పార్లమెంట్‌లో పార్టీ తరఫున గట్టిగా వాణి వినిపించవచ్చని బాబు భావిస్తున్నట్లు సమాచారం.

నిజానికి విజయ్‌కు పార్లమెంట్ మెట్లు ఎక్కాలనేది పాత కోరికే. గత ఎన్నికల్లోనే ఆయన అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి గట్టి ప్రయత్నాలు చేసినా, పొత్తుల సమీకరణాల వల్ల ఆ సీటు వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేరుగా రాజ్యసభ సీటే ఆఫర్ రూపంలో వస్తుండటంతో విజయ్ ఢిల్లీ టూర్ దాదాపు ఖాయమనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ అనూహ్య పరిణామం నర్శీపట్నం నియోజకవర్గంలో కొత్త చర్చకు దారితీసింది. విజయ్ కనుక ఎంపీగా ఢిల్లీకి వెళ్తే.. మరి మరో మూడేళ్లలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నర్శీపట్నం(Narsipatnam) నుంచి అయ్యన్న వారసుడిగా ఎవరు పోటీ చేస్తారనే సస్పెన్స్ మొదలైంది.
ఈ క్రమంలోనే అయ్యన్నపాత్రుడి రెండో కుమారుడు రాజేష్ పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే కౌన్సిలర్‌గా పనిచేసి, నర్శీపట్నం మున్సిపాలిటీ పరిధిలో మంచి పట్టు సాధించిన రాజేష్.. అన్న ఢిల్లీ(Delhi)కి వెళ్తే ఇక్కడ లోకల్ అసెంబ్లీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఒకే కుటుంబానికి ఇటు ఎంపీ, అటు ఎమ్మెల్యే సీట్లు కేటాయించేందుకు టీడీపీ అధిష్టానం ఒప్పుకుంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.