శ్రీవారి కిరీటం తాక‌ట్టు: స‌ర్కారు సీరియ‌స్‌!

admin
Published by Admin — May 21, 2026 in Andhra
News Image

ఏపీ ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కార్య‌క్ర‌మం మ‌రొక‌టి జ‌రిగింది. తిరుమ‌ల కాక‌పోయినా.. గుడివాడ‌లో దాదాపు అంతే ప‌విత్రంగా స్థానికులు పూజించుకునే శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామికి సంబంధించిన 70 ల‌క్ష‌లకు పైగా విలువైన బంగారం, వ‌జ్రాల‌తో కూడిన కిరీటాన్ని.. తాక‌ట్టు పెట్టారు. ఈ నిధుల‌ను.. ఆల‌యంలోనే మ‌రో క‌ళ్యాణ మండ‌పం క‌ట్టేందుకు వినియోగించ‌నున్నామ‌ని.. క‌మిటీ స‌భ్యులు చెబుతున్నారు.

కానీ, లెక్క‌లు, ప‌త్రాలు లేక‌పోవ‌డం.. ఆల‌య క‌మిటీ స‌భ్యులు కూడా త‌ప్పించుకుని తిరగ‌డంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా పెను దుమారం రేపుతోంది. ప్ర‌భుత్వాన్ని కార్న‌ర్ చేస్తూ.. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో ప్ర‌భుత్వం హుటాహుటిన స్పందించింది. ఈ ఘ‌ట‌న‌పై త‌క్ష‌ణ‌మే నివేదిక ఇవ్వాల‌ని దేవ‌దాయ శాఖ స‌హాయ క‌మిష‌న‌ర్ ల‌లిత‌ను ఆదేశించింది. దీంతో ఆమె ఆల‌యానికి చేరుకున్నా.. క‌మిటీ నుంచి స‌రైన స‌హ‌కారం ల‌భించ‌లేదు.

ఏం జ‌రిగింది?

గుడివాడ‌లో రెండుకీల‌క ఆల‌యాలు ఉన్నాయి. ఒక‌టి ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యం. ఇది దేవ‌దాయ ప‌రిధిలోనే ఉంది. అలానే.. వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం.. ఇది కూడా దేవ‌దాయ ప‌రిధిలోనే ఉంది. అయితే.. ఆయ‌ల‌న నిర్వాహ‌క‌ క‌మిటీల‌ను మాత్రం వేర్వేరుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలావుంటే.. గ‌త ఏడాది మాటూరి సుబ్బారావు అనే 80 ఏళ్ల వ్యాపారి.. శ్రీవారికి 70 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కుపైగా విలువైన వ‌జ్రాలు-బంగారంతో రూపొందించిన కిరీటాన్నికానుకగా ఇచ్చారు.

అనంత‌రం.. గ‌త శ‌నివారం ఆయ‌న ఆల‌యానికి వెళ్లి చూడ‌గా.. శ్రీవారికి అలంకరించాల్సిన కిరీటం క‌నిపించ‌లేదు. దీంతో ఏద‌ని ప్ర‌శ్నించ‌గా.. లాక‌ర్‌లో పెట్టామ‌ని క‌మిటీ స‌భ్యులు చెప్పారు. అయితే.. వారు చెప్పిన బ్యాంకులో ఎక్క‌డా కిరీటం లేద‌ని తెలుసుకున్న సుబ్బారావు.. మ‌రో నాలుగు రోజుల త‌ర్వాత‌.. వెళ్లి.. కిరీటం గురించి క‌మిటీని ఆరా తీయ‌గా.. క‌ల్యాణ మండపం కోసం తాక‌ట్టు పెట్టిన‌ట్టు వారు చ‌ల్ల‌గా చెప్పారు. దీంతో హ‌తాశుడైన సుబ్బారావు.. ఈ వ్య‌వ‌హారాన్ని మీడియా దృష్టికి తీసుకువ‌చ్చారు.

అయితే.. క‌మిటీ స‌భ్యులు ప్రైవేటు వ్య‌క్తి వ‌ద్ద తాక‌ట్టు పెట్టిన‌ట్టు అధికారులు తెలుసుకున్నారు. దీంతో విష‌యం తెలుసుకున్న స‌ద‌రు వ్యాపారి.. ప‌రార‌య్యారు. త‌న డ‌బ్బులు త‌మ‌కు ఇస్తేనే.. కిరీటం అప్ప‌గిస్తాన‌ని భీష్మించారు. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ప్ర‌భుత్వం.. చ‌ర్య‌ల‌కు ఆదేశించింది.

Tags
Ap government cm chandrababu gudiwada temple angry
Recent Comments
Leave a Comment

Related News