జైలుకు వెళ్లాలని.. పోలీసులతో తిట్లు తినాలని ఎవరూ అనుకోరు. అంతేకాదు.. ఖైదీ దుస్తులు ధరించాలని కూడా భావించరు. ఇక, జైలు మాన్యువల్ ప్రకారం.. ఒకరి అండర్‌లో బతకాలని కూడా అనుకోరు. కానీ, క్షణికావేసంలో చేస్తున్న పొరపాట్లు.. నేరాలు కారణంగా చాలా మంది జైలుకు వెళ్తున్నారు. ఇదొక భాగం అయితే.. కొందరు అనుభూతి కోసం జైలుకు వెళ్లాలని అనుకునే వారు ఉంటారు. అందుకే.. ఇటీవల కాలంలో హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో జైలు హోటళ్లు పెరుగుతున్నాయి. జైల్లో ఉన్నట్టుగా ఒక బ్యారక్‌ను ఏర్పాటు చేసి..అక్కడే ఆహార పదార్థాలను వడ్డిస్తారు. ఇదో అనుభూతి అంటూ కొందరు వాటికి కూడా ఎగబడుతున్నారు.
ఇలా జైలు అనుభూతిని కోరుకునే వారి కోసం చెంచల్ గూడ జైలు అధికారులు డబ్బులిచ్చి జైల్లో ఉండి.. ఆ అనుభూతిని సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ``ఫీల్ ది జైల్`` పేరుతో ఒక కాన్సెప్టును రూపొందించారు. దీనిని మంగళవారం తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. బుధవారం ఈ ఫీల్ ది జైల్ కాన్సెప్టుకు సంబంధించి జైలు అధికారులు నియమాలు, నిబంధనలు.. రుసుములు వంటివివరాలతో పెద్ద ప్రకటనే ఇచ్చారు. దీని ప్రకారం.. జైలుఅధికారులకు డబ్బులు చెల్లించి.. జైలు అనుభూతిని సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.
ఫీల్ ది జైల్ అనుభవం కోరుకునే వారు ఒక్కరికి రోజుకు 2 వేల రూపాయలుగా రుసుమును నిర్ణయించారు. అదేసమయంలో 12, 24 గంటలుగా కూడా దీనిని విభజించారు. ఆ మేరకు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఫీల్ ది జైల్ ఎంపిక చేసుకుని వచ్చే వారికి ప్రత్యేకంగా రూపొందించిన జైలు గదుల్లో బస కల్పిస్తారు. రిమాండ్ ఖైదీలకు ఇచ్చే దుస్తులను కూడా ఇస్తారు. టెంపరరీ ఖైదీ నెంబర్‌ను కేటాయించి.. అచ్చంగా రిమాండ్ ఖైదీ మాదిరిగానే ట్రీట్ చేస్తారు.(అనుభూతి కలగాలి కదా!) ఇక, జైల్లో ఖైదీలకు ఎలాంటి తిండి పెడతారో.. వీరికి కూడా అదే తిండి పెడతారు. ఖైదీల మాదిరిగానే ఉదయం నిద్రలేవడం.. పనులు చేయడం.. 7 గంటలకే భోజనం చేయడం.. ఇలా.. అన్నీ అచ్చంగాఖైదీలమాదిరిగానే ఉంటుంది.
ఏంటి లాభం..?
జైలులో ఉండేవారి పరిస్థితులు బయట ఉన్నవారికి తెలియదు. ఫీల్ ది జైలు ద్వారా ఆ అనుభవం తెలుస్తుంది. అదేవిధంగా ఏ నేరానికి ఏయే శిక్షలు పడతాయో కూడా తెలుసుకోవచ్చు. ఖైదీల జీవన విధానం.. వారిలో మార్పు కోసం అధికారులు చేసే ప్రయత్నాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో సంగారెడ్డి హెరిటేజ్ జైలు మ్యూజియంలో 'ఒక రోజు జైలు అనుభవం` పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు చెంచల్ గూడలోనూ దీనిని కొనసాగిస్తున్నారు. దీని ద్వారా వచ్చే సొమ్మును ఖైదీల సంక్షేమానికి వినియోగిస్తారట.