తెలంగాణ బీజేపీ సీనియర్‌నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన పోక్సోకేసును కొట్టి వేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ మేరకు భగీరథ్ తరఫున ఆయన న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో వేకేషన్ బెంచ్ ఈ పిటిషన్‌ను ఈ నెల 14న విచారిస్తామని ప్రకటించింది.
ఈ లోగానే అరెస్టు?
మరోవైపు.. బండి భగీరథ్.. తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో భగీరథ్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌కావడంతో ఉన్నతాధికారులు భగీరథ్ అరెస్టు పై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
బాధితులకు బండి బెదిరింపులు..
ఈ కేసులో మరో కీలక పరిణామం తెరమీదికి వచ్చింది. బండి భగీరథ్ బాధితురాలైన బాలికను ఆమె కుటుంబంతో సహా.. ఓ జర్నలిస్టు.. బండి నివాసానికి తీసుకువచ్చారని.. ఈ సమయంలో కేంద్ర మంత్రి ఆ కుటుంబాన్ని బెదిరించారని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీనిపై కూడా బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ``ఇంతకు ముందు ఎంతమందితో ఉన్నావో..`` అంటూ తన కుమార్తెను కేంద్ర మంత్రి అవమానించారని ఆమె చెబుతున్నారు. ఇదే నిజమైతే.. కేంద్ర మంత్రిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
బండి ఫిర్యాదుతో..
బాధిత కుటుంబంపై భగీరథ్ చేసిన ఫిర్యాదు మేరకు.. కరీంనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన కుటుంబాన్ని తనను కూడా బాధిత బాలిక వేధించిందని.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిందని.. అలాఇవ్వనందుకే.. తనపై కేసు పెట్టారని భగీరథ్ ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.