డజనుకు పైగా వరుస ఫ్లాపుల తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, అఆ, భీష్మ లాంటి హిట్లతో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక దశలో మంచి ఊపు మీదే కనిపించాడు నితిన్(Nithin). మధ్య మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా.. మళ్లీ ఓ పెద్ద హిట్‌తో పుంజుకుంటూ ఉండేవాడు. కానీ భీష్మ తర్వాత మాత్రం అతను విజయానికి ముఖం వాచిపోయాడు. గత ఏడాది తమ్ముడు చిత్రంతో కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు నితిన్.
దీంతో అతడితో సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలు భయపడే పరిస్థితి తలెత్తింది. ఆల్రెడీ దిల్ రాజు ప్రొడక్షన్లోనే నితిన్ చేయాల్సిన యల్లమ్మ అతడి చేజారింది. మరోవైపు విక్రమ్ కుమార్‌తో ఒక సినిమాకు ప్రయత్నాలు జరగ్గా అది ముందుకు కదల్లేదు. ఇప్పుడు నితిన్ సినిమా(movie) ఇంకోటి క్యాన్సిల్ అయింది. కథ ఓకే అయి, ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాక ఈ సినిమా ఆగిపోవడం గమనార్హం.
ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో మంచి పేరు సంపాదంచి, ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోయిన విలక్షణ దర్శకుడు వీఐ ఆనంద్.. నితిన్‌తో చేయాల్సిన సినిమా బడ్జెట్(budget) సమస్యలతో ఆగిపోయినట్లు తెలుస్తోంది. శ్రీనవాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్బించాల్సింది. ఇది వీఐ ఆనంద్ మార్కు సైఫై థ్రిల్లర్. నితిన్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఇప్పుడు తనదే కాదు.. మొత్తంగా తెలుగు సినిమా మార్కెట్టే దారుణంగా ఉంది. సినిమాలకు డిజిటల్ హక్కుల ధరలు బాగా పడిపోయాయి. థియేటర్లకు జనం రావడం తగ్గిపోయింది.
పెట్టుబడులు వెనక్కి రావడం చాలా కష్టమైపోతోంది. మిడ్ రేంజ్ హీరోల మీద వారి మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టిన కొందరు నిర్మాతలు సినిమాలు మధ్యలో ఆగిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో నితిన్, ఆనంద్ సినిమా కూడా బడ్జెట్ పరంగా చాలా రిస్కీ అని భావించి దాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఐతే ఈ సినిమా కథ ఎగ్జైటింగ్‌గా ఉంటుందని అంటున్నారు.. నిర్మాత, హీరో కుదిరితే ఆనంద్ దీన్ని తెరకెక్కించే అవకాశాల లేకపోలేదు.