తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. వెండితెరపై దశాబ్దాల పాటు దళపతిగా అలరించిన జోసెఫ్ విజయ్, ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జన నాయకుడి పాత్రలోకి ప్రవేశించారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం సాక్షిగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం, రాష్ట్ర రాజకీయాల్లో 59 ఏళ్ల ద్రావిడ రాజకీయాల ఏకఛత్రాధిపత్యానికి బ్రేక్ వేస్తూ సరికొత్త చరిత్రను లిఖించింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించగా, స్టేడియం మొత్తం తమిళగ వెట్రి కళగం నినాదాలతో హోరెత్తిపోయింది.

ఈ చారిత్రక వేడుకలో అందరి కళ్లూ ఇద్దరు వ్యక్తులపైనే ప్రత్యేకంగా నిలిచాయి. ఒకరు జాతీయ రాజకీయాల కీలక నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కాగా, మరొకరు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష. రాహుల్ గాంధీ రాక విజయ్ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో ఉన్న మద్దతును చాటిచెప్పగా, విజయ్ సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన త్రిష(Trisha) హాజరవ్వడం సినీ అభిమానులకు కనువిందుగా మారింది. వీరిద్దరి ఉనికి ఈ రాజకీయ సభకు ఒక ప్రత్యేకమైన గ్లామర్‌ను, గాంభీర్యాన్ని జోడించి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
రాజకీయంగా ఎన్నో మలుపులు దాటుకుని వచ్చిన విజయ్(Vijay), తన తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభల సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఒక భావోద్వేగ ఘట్టం. ప్రమాణ స్వీకారానికి ముందే తన కేబినెట్ సభ్యులను గవర్నర్‌కు పరిచయం చేసిన విజయ్, పాలనలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమనే సంకేతాన్ని ఇచ్చారు. ఈ వేడుకకు బీజేపీ నేతలు నైనార్ నాగేంద్రన్, తమిళిసై సౌందరరాజన్ వంటి రాజకీయ ప్రముఖులు కూడా హాజరై విజయ్‌కు అభినందనలు తెలిపారు.

తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించి, నేరుగా అసెంబ్లీ బరిలోకి దిగిన విజయ్.. తొలి పోరులోనే 108 స్థానాలను కైవసం చేసుకుని తన సత్తా చాటారు. కాంగ్రెస్, వామపక్షాలు (సీపీఐ, సీపీఎం), వీసీకే, ఐయూఎంఎల్ వంటి బలమైన మిత్రపక్షాల మద్దతుతో 120 మంది ఎమ్మెల్యేల బలంతో ఆయన సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ద్రావిడ పార్టీల కోటలో ఒక కొత్త రాజకీయ శక్తి ఇలా భారీ మెజారిటీతో పీఠం దక్కించుకోవడం తమిళనాట పెను మార్పులకు నాందిగా విశ్లేషకులు భావిస్తున్నారు.