సొంత‌ గ‌డ్డ‌పై ఓడిన సీఎం స్టాలిన్.. అసలెవరీ వి.ఎస్. బాబు?

admin
Published by Admin — May 04, 2026 in
News Image

తమిళనాట ద్రవిడ రాజకీయాల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. అజేయుడు అని భావించిన ఎం.కె. స్టాలిన్(CM MK Stalin) తన సొంత కోట 'కొలత్తూరు'లో కుప్పకూలడం భారత రాజకీయాల్లోనే అతిపెద్ద సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి, దశాబ్దాల చరిత్ర ఉన్న నేతను కేవలం 9వేల ఓట్ల తేడాతో మట్టికరిపించి, దేశం చూపు తనవైపు తిప్పుకున్నారు వి.ఎస్. బాబు. ఇంతకీ ఎవరీ బాబు? స్టాలిన్ కోటను పడగొట్టడానికి ఆయన వేసిన వ్యూహమేంటి?

వి.ఎస్. బాబు రాజకీయాలకు కొత్తేమీ కాదు, కానీ ఆయనలోని కొత్త కోణాన్ని ఇప్పుడు తమిళనాడు చూస్తోంది. గతంలో డీఎంకేలోనే ఉంటూ, చెన్నై నగర రాజకీయాలను వేళ్లపై ఆడించిన అనుభవం ఆయనది. 2006లోనే పురసవాక్కం ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందిన బాబు, క్షేత్రస్థాయిలో సామాన్యుడి కష్టనష్టాలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు. పక్కా మాస్ లీడర్‌గా గుర్తింపు ఉన్న ఆయన, సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) గూటికి చేరడం రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది.

సిట్టింగ్ ముఖ్యమంత్రిపై పోటీ చేయడం అంటే రాజకీయంగా ఆత్మహత్యతో సమానమని అందరూ అనుకున్నారు. కానీ, విజయ్(Vijay) తన పార్టీలోని అనుభవానికి పెద్దపీట వేస్తూ బాబును స్టాలిన్‌పైకి యుద్ధానికి పంపారు. టీవీకే సిద్ధాంతాలకు, బాబుకున్న వ్యక్తిగత ఇమేజ్ తోడవడంతో కొలత్తూరు ఓటర్లు మార్పు వైపు మొగ్గు చూపారు. 1996 నుండి ఓటమి ఎరుగని స్టాలిన్ రికార్డుకు బాబు బ్రేక్ వేయడం వెనుక ఆయన చేసిన నిశ్శబ్ద పోరాటం ఎంతో ఉంది.

తమిళనాడు(Tamilnadu) అసెంబ్లీలో 2026 మే 4 ఒక చారిత్రక దినంగా నిలిచిపోతుంది. సామాన్య అభ్యర్థిగా బరిలోకి దిగి, ఒక శక్తివంతమైన ముఖ్యమంత్రిని గద్దె దించడం ద్వారా బాబు జైంట్ కిల్లర్ గా అవతరించారు. ఈ గెలుపు కేవలం బాబుది మాత్రమే కాదు, విజయ్ స్థాపించిన కొత్త రాజకీయ ప్రత్యామ్నాయానికి ప్రజలు పట్టం కట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు వి.ఎస్. బాబు పేరు తమిళనాట‌ మారుమోగిపోతోంది.

Tags
TN Election Results 2026 TVK MK Stalin VS Babu Thalapathy Vijay Tamil Nadu Politics DMK
Recent Comments
Leave a Comment

Related News