తెలంగాణ(Telangana) రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. గులాబీ గూటిలో రాజుకున్న చిచ్చు వీధిన పడటమే కాకుండా, ఏకంగా కొత్త పార్టీ ఆవిర్భావానికి దారితీసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మేడ్చల్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో 'తెలంగాణ రాష్ట్ర సేన (TRS)' పేరుతో కొత్త పార్టీని ప్రకటించి, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు.
ఈ సందర్భంగా కవిత చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన తండ్రి కేసీఆర్‌పై ఆమె చేసిన విమర్శలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రస్తుతం మనం చూస్తున్న కేసీఆర్(KCR) గారు ఒకప్పటి ఉద్యమ నేత కాదు.. ఆయన కేవలం ఒక మర మనిషిలా మారిపోయారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రస్తుతం కొంతమంది స్వార్థపరులైన గుంట నక్కల చేతిలో బందీ అయ్యారని, అందుకే తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన కొన్ని రాజకీయ తప్పిదాల్లో తనకూ భాగస్వామ్యం ఉందని నిజాయితీగా అంగీకరిస్తూనే, వాటన్నింటినీ సరిదిద్ది సామాజిక తెలంగాణను నిర్మిస్తానని ఆమె హామీ ఇచ్చారు.
పాత సెంటిమెంట్‌ను గుర్తుచేసేలా తన పార్టీకి 'తెలంగాణ రాష్ట్ర సేన (TRS)' అనే పేరును ఖరారు చేయడం విశేషం. పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్‌ను పొందుపరిచి, పార్టీ సిద్ధాంతాలను వివరించారు. బీఆర్ఎస్ పార్టీ తన మౌలిక సిద్ధాంతాల నుంచి పక్కకు జరిగిందని, అందుకే మళ్లీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు ఈ TRS అవసరమని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా తనకు స్వేచ్ఛను ప్రసాదించారని, ఇకపై ప్రజల పక్షాన నిర్భయంగా పోరాడుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఈ సభలో కవిత(Kavitha) తన రాజకీయ ఆకాంక్షను ఏమాత్రం దాచుకోలేదు. "తెలంగాణలోని మూడున్నర కోట్ల మందికి ఒక 'అమ్మ'లా సేవ చేయడమే నా సంకల్పం. రాబోయే రెండేళ్లలో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తాం.. నేనే తెలంగాణకు తదుపరి ముఖ్యమంత్రిని అవుతాను" అంటూ బలమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు.