పిఠాపురంలో జనసేన(Janasena) పార్టీ అంతర్గత సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. సాధారణంగా సౌమ్యంగా ఉండే కొణిదెల నాగబాబు, స్థానిక నేతల తీరుపై నిప్పులు చెరిగారు. పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చేందుకు వచ్చిన నాగబాబుకు అక్కడ ఎదురైన అనుభవం తీవ్ర అసహనానికి గురిచేసింది. దీంతో ఆయన నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
శస్త్రచికిత్స అనంతరం పవన్ కల్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తన తమ్ముడి ఆరోగ్య పరిస్థితిని వివరించడానికి, నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించడానికి నాగబాబు పిఠాపురం(Pithapuram)లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అయితే, మీటింగ్ మొదలవ్వగానే సీన్ రివర్స్ అయింది. పవన్ ఆరోగ్యం గురించి ఆరా తీయడం పక్కన పెట్టి, నేతలంతా తమ వ్యక్తిగత డిమాండ్లు, కమిటీల గోడవలు, స్థానిక సమస్యలనే అజెండాగా మార్చేశారు.
నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తుండటంతో నాగబాబు ఒక్కసారిగా గట్టిగా నిలదీశారు. "పవన్ కల్యాణ్(Pawan Kalyan) గారు ఈ నియోజకవర్గం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఆయనకు సర్జరీ అయి విశ్రాంతి తీసుకుంటుంటే.. కనీసం ఆరోగ్యం ఎలా ఉందని అడిగే సంస్కారం మీలో ఒక్కరికైనా ఉందా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీకు అసలు కొంచమైనా సెన్స్ ఉందా? నేను వచ్చింది ఇక్కడ మీ గొడవలు వినడానికి కాదు" అని ఆయన హెచ్చరించడంతో హాల్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది.
నాగబాబు(Nagababu) ఆవేశాన్ని చూసిన స్థానిక నాయకులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పవన్ ఆరోగ్యంపై ఆరా తీయకుండా కేవలం పదవులు, సమస్యల గురించే మాట్లాడటం తమ తప్పేనని అంగీకరిస్తూ ఆయనకు క్షమాపణలు చెప్పారు. అనంతరం సర్దుమణిగిన నాగబాబు.. పవన్ మరో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో విధుల్లోకి చేరుతారని స్పష్టం చేశారు. అలాగే గత రెండేళ్లలో పిఠాపురం అభివృద్ధికి రూ.600 కోట్లు ఖర్చు చేశామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. చివరగా, వివాదాల జోలికి వెళ్లొద్దని క్యాడర్‌కు గట్టిగా సూచించారు.