అసెంబ్లీలోకి వీరప్పన్ ఫ్యామిలీ.. అస‌లు ట్విస్ట్ అదే!

admin
Published by Admin — April 20, 2026 in Politics
News Image

ఒకప్పుడు గంధపు చెక్కల స్మగ్లర్‌గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరు వీరప్పన్(Veerappan). దశాబ్దాల పాటు కర్ణాటక, తమిళనాడు సరిహద్దు అడవులను తన కనుసన్నలతో శాసించిన వీరప్పన్ అధ్యాయం ఎన్‌కౌంటర్‌తో ముగిసినా, ఆయన పేరు చుట్టూ ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడు అదే పేరు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కుటుంబం అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు సిద్ధమవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ ఇంట్లోనే తల్లీకూతుళ్లు చెరో పార్టీ తరఫున బరిలోకి దిగడం అసలైన ట్విస్ట్‌గా మారింది.

వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి, పెద్ద కుమార్తె విద్యారాణి(Vidhya Rani) ఇద్దరూ ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వీరిద్దరూ ఒకే పార్టీ తరఫున కాకుండా, వేర్వేరు రాజకీయ జెండాలను పట్టుకున్నారు. ముత్తులక్ష్మి 'తమిళగ వఘరిమై కట్చి' (TVK) తరఫున కృష్ణగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తుండగా, కుమార్తె విద్యారాణి 'నామ్ తమిళర్ కట్చి' (NTK) తరఫున మెట్టూరు నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తమిళనాడు(Tamil Nadu)లోని వన్నియర్ సామాజిక వర్గంలో వీరప్పన్‌కు ఇప్పటికీ ఒక రకమైన సానుభూతి ఉంది. ఆయనను తమ కుల రక్షకుడిగా, తమిళ అటవీ సంపదను కాపాడిన వీరుడిగా కొందరు అభిమానిస్తుంటారు. ఈ ఓటు బ్యాంకునే లక్ష్యంగా చేసుకున్న తల్లీకూతుళ్లు.. తమ ప్రచారంలో వీరప్పన్ ఫోటోలను విచ్చలవిడిగా వాడుతున్నారు. ముఖ్యంగా వన్నియర్ యువత ఈ ఇద్దరు మహిళల ప్రచారానికి స్వచ్ఛందంగా తరలివస్తుండడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా, గత ఎన్నికల్లోనే విద్యారాణి తన సత్తా చాటుకున్నారు. కృష్ణగిరిలో పోటీ చేసిన ఆమె, కేవలం 2 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచారు. ఈసారి ఆ స్థానంలో తల్లి ముత్తులక్ష్మి పోటీ చేస్తుండడం విశేషం. తాజా సర్వేల ప్రకారం.. ఈ ఇద్దరికీ ప్రజా మద్దతు గణనీయంగా పెరిగిందని, తల్లీకూతుళ్లు ఇద్దరూ ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని టాక్ వినిపిస్తోంది.  

Tags
Tamil Nadu Elections 2026 Veerappan Vidhya Rani Veerappan Muthulakshmi Veerappan TN Politics TVK NTK
Recent Comments
Leave a Comment

Related News