వివాదాలకు కేరాఫ్‌గా ఉండే.. బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్.. మరోసారి చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఆయన కేంద్రం అమలు చేస్తున్న జీఎస్‌టీని విమర్శించే క్రమంలో రామాయణాన్ని.. దీనికి ఉదాహరణగా చూపుతూ .. చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాలను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. ఈ వ్యాఖ్యలపై తక్షణమే ప్రకాష్ రాజ్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, బీజేపీ కీలక నాయకుడు, తిరుమల తిరుపతి బోర్డు మెంబర్.. భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పకపోతే.. 100 కోట్ల రూపాయల మేరకు పరువు నష్టం దావా వేయనున్నట్టు తెలిపారు.
అసలు ఏం జరిగింది?
ఓ జాతీయ మీడియా నిర్వహించి కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ప్రకాష్ రాజ్.. సమకాలీన అంశాలపై స్పందించారు. ముఖ్యంగా ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని.. ఈ నేపథ్యం లో జీఎస్‌టీని తగ్గించాలని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అయినదానికీ.. కాని దానికీ జీఎస్‌టీని వసూలు చేస్తున్నారన్న వాదనను బలంగా వినిపించారు. ఈ క్రమంలోనే రామాయణాన్ని ఆయన ఉదహరించారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి.
ఇవీ వివాదానికి దారితీసిన కామెంట్లు..
1) రాముడు ఉత్తరాదివాడని.. ఆయన సోదరుడు లక్ష్మణుడితో కలిసి.. దక్షిణాదికి వస్తాడని ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యానించారు. రాముడికి ప్రాంతాలను అంటగట్టడంపై వివాదం చెలరేగింది.
2) ఓ తోటలో లక్ష్మణుడు పండ్లు దొంగతనం చేస్తాడని ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యానించారు. .. లక్ష్మణుడిని దొంగగా పేర్కొనడం మరో వివాదానికి కారణమైంది.
3) ఈ సమయంలో గిరిజనులైన.. శూర్ఫణక, రావణాసురుడు అక్కడికి వస్తారని ప్రకాష్ రాజ్ చెప్పారు. వాస్తవానికి రావణాసురుడు బ్రాహ్మణుడు. ఈ విషయాన్ని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదో వివాదంగా మారింది.
4) కీలకమైన వ్యాఖ్య ఏంటంటే.. లక్ష్మణుడు దొంగిలించిన పండుకు.. గిరిజనురాలైన శూర్ఫణక జీఎస్టీ కట్టాలని డిమాండ్ చేస్తుంది. ఇదీ.. అసలు వివాదం. జీఎస్టీ రామాయణకాలంలో ఎక్కడుంది? ఇది ఉద్దేశ పూర్వకంగా కేంద్రాన్ని అవమానించడమేనన్నది రగడ. అయితే.. ఈ విషయాన్ని తెరమరుగు చేస్తున్న కొందరు.. రాముడు ఉత్తరాది వాడంటూ.. ప్రాంతీయ బేధాలు సృష్టించారు కాబట్టి.. లక్ష్మణుడిని దొంగగా పేర్కొన్నారు కాబట్టి.. కేసు పెట్టాలనికోరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తిరుపతి జల్లా కు చెందిన బీజేపీ నేత భాను ప్రకాష్.. నటుడు ప్రకాష్‌రాజ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. మరి దీనిపై ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.