సీఎం రేసులో లోకేశ్ మరో అడుగు!

admin
Published by Admin — April 15, 2026 in Andhra
News Image

ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీలో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేష్‌ను నియ‌మించారు. ఇదే స‌మ‌యంలో మ‌రింత మందికి రాష్ట్ర స్థాయి కమిటీల్లో చోటు క‌ల్పించారు. వీరిలో అధిక సంఖ్య‌లో మ‌హిళ‌లు కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నారా లోకేష్‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని సృష్టించి.. ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో, సీఎం రేసులో లోకేశ్ మరో అడుగు వేసినట్లయింది.

ప్ర‌స్తుతం సృష్టించిన వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వితో నారా లోకేష్ పార్టీలో నెంబ‌ర్ 2 కానున్నారు. పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు, జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌... కీల‌క బాధ్య‌తు చేప‌ట్ట‌గా.. రాష్ట్ర పార్టీ చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావును కొన‌సాగించారు. 26 మందితో పార్టీ పొలిట్ బ్యూరో ను ఏర్పాటు చేశారు. దీనిలో తొలిసారి మంత్రి వంగ‌ల పూడి అనిత‌కు.. అదేవిధంగా జ్యోతుల నెహ్రూ, పితాని స‌త్య‌నారాయ‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించారు.

పార్టీ ఎక్స్ అఫిషియో స‌భ్యులుగా ముగ్గురిని ఎంపిక చేశారు. వీరిలో నారా లోకేష్‌, ప‌ల్లా శ్రీనివాస‌రావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయులుకు అవ‌కాశం ఇచ్చారు. పార్టీ కోశాధికారి ప‌ద‌విని తొలిసారి సృష్టించి.. దీనిని మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌రావుకు అప్ప‌గించారు. జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా ముగ్గురికి అవ‌కాశం ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌ద‌వులు లేవు. కేవ‌లం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఒక్క‌టే ఉండేది. అది నారా లోకేష్ చూసేవారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు, ఎంపీ బైరెడ్డి శ‌బ‌రి, కిలారు రాజేష్‌ల‌తో కూడిన జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌ను ఎంపిక చేశారు.

అదేస‌మ‌యంలో జాతీయ ఉపాధ్య‌క్ష ప‌ద‌వులను 18 ఏర్పాటు చేశారు. జాతీయ అధికార ప్ర‌తినిధులుగా 10 మందిని, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా.. ఏడుగురు, ఉపాధ్య‌క్షులుగా.. 16 మంది, రాష్ట్ర స్థాయి అధికార ప్ర‌తినిధులుగా 14 మందిని నియ‌మించారు. మొత్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని చాలా కొత్త క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. వీరిలో యువ‌త‌కు ఎక్కువ‌గా అవ‌కాశం క‌ల్పించినా.. అంద‌రూ పాత ముఖాలే ఉండ‌డం విశేషం.

Tags
minister nara lokesh tdp national working president lokesh new post to be cm lokesh one more step
Recent Comments
Leave a Comment

Related News